తెలంగాణ వ్యాప్తంగా కర్ఫ్యూ అమలులో ఉన్న నేపథ్యంలో మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ప్రజలకు ఎస్పీ వెంకటేశ్వర్లు అవగాహన కల్పించారు. తెలంగాణ చౌరస్తాలో దుకాణ యజమానులను కలిసి దుకాణాలు సమయానికి మూసి వేయాల్సిందిగా సూచించారు.
జిల్లా ప్రజలు, వ్యాపారవేత్తలు పోలీసు వారికి సహకరించాలని కోరారు. ఎమర్జెన్సీ సర్వీసులు, పెట్రోల్ బంకులు, మీడియా, ఇతర అత్యవసర విభాగాలకు మినహాయింపు ఉంటుందని వివరించారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు కర్ఫ్యూ సమయంలో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై విపత్తుల నివారణ చట్టాల మేరకు జరిమానాలతో పాటు కేసులు నమోదు చేస్తామన్నారు.
ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, వ్యాపార సంస్థలు, రెస్టారెంట్లను రాత్రి 8 గంటల లోపు మూసివేయాలన్నారు. కర్ఫ్యూ నుంచి మినహాయించిన ప్రభుత్వ ఉద్యోగులు, వైద్య సిబ్బంది, మీడియా ప్రతినిధులు విధిగా గుర్తింపు కార్డులను కలిగి ఉండాలన్నారు. ఎయిర్‌పోర్టులు, రైల్వేస్టేషన్లు, బస్టాండ్లకు వెళ్లే ప్రయాణికులు తగిన ఆధారాలను దగ్గర ఉంచుకోవాలని సూచించారు. రంజాన్ నేపథ్యంలో ప్రార్థనలు సైతం వీలైనంత త్వరగా ముగించుకుని 9 గంటలలోపు ఇళ్లకు చేరుకొనేలా చూసుకోవాలని వెల్లడించారు.
ఇదీ చదవండి: అమల్లోకి రాత్రి కర్ఫ్యూ.. మే 1 వరకు ఆంక్షలు