Onion prices fall in Telangana: ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉల్లి పండించిన రైతులు బహిరంగ మార్కెట్లో ధరలు పతనమై తీవ్రంగా నష్టపోతున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మార్కెట్లో ఉల్లిధరలు గరిష్టంగా క్వింటాకు రూ. వెయ్యి.. కనిష్టంగా రూ. 400, నాణ్యత తగ్గితే కేవలం క్వింటా 200 రూపాయలకు మాత్రమ కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆందోళన చెందుతున్నారు.
పెరిగిన దిగుబడులు.. మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లోని వివిధ మండలాల్లో సుమారు 5 నుంచి 8వేల ఎకరాల్లో రైతులు ఉల్లి సాగు చేశారు. ఈసారి ఉల్లి దిగుబడులు బాగా వచ్చాయి. కాని అమ్ముకుందామని మార్కెట్లకు వెళ్తే ధరలు అంతంత మాత్రంగా ఉన్నాయి. గడ్డ ఏరేందుకు ఒక్క కూలీని నియమిస్తేనే 500 రూపాయలు చెల్లించాలి. అలాంటిది క్వింటా 500 రూపాయలకు కూడా ధర పలకకపోతే పెట్టుబడులైనా తిరిగి వచ్చేదెలా అని ఉల్లి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నేరుగా విక్రయం.. మార్కెట్ లో ధరలు లేకపోవడంతో కొందరు ఉల్లిరైతులు ఇల్లిల్లూ తిరిగి గడ్డను అమ్ముకుంటున్నారు. వ్యాపారులకు కిలో 2 రూపాయలకు అమ్మేబదులు నేరుగా వినియోగదారులకు కిలో 3 నుంచి 5 రూపాయల వరకూ అమ్ముతున్నారు. దానివల్ల కనీసం కూలీ ఖర్చులు పెట్టుబడులైన చేతికందుతాయని భావిస్తున్నారు. మరోమూడు వారాలపాటు ఉల్లి దిగుబడులు గణనీయంగా పెరగనున్నాయి. ఈ నేపథ్యంలో ధరలు ఇంకా పతనమవుతాయేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.
"మూడు ఎకరాల్లో ఉల్లి పంట వేశాను. పంటను మార్కెట్‌కు తీసుకువస్తే పెట్టుబడులు వచ్చే పరిస్థితి కూడా కనిపించడం లేదు. పురుగుమందుల రేట్లు, కూలీల రేట్లు బాగా పెరిగాయి. ప్రస్తుతం మార్కెట్లో ఉల్లి ధర బాగా పడిపోయింది. ప్రభుత్వం స్పందించి.. గిట్టుబాటు ధర కల్పించి ఉల్లి రైతులను ఆదుకోవాలి". - ఉల్లి రైతు
"ఇతర రాష్ట్రాలలోని వ్యాపారులు ఇక్కడ కమిషన్ ఏజెంట్లతో ఉల్లిని కొనుగోలు చేస్తుంటారు. ఆయా ప్రాంతాల్లోనూ ఉల్లి దిగుబడులు గణనీయంగా పెరిగిపోవడంతో ఇక్కడి నుంచి కొనుగోలు చేసేవాళ్ల కరవయ్యారు. దీంతో కమీషన్ ఏజెంట్లు స్థానిక అవసరాలు, తాత్కాలిక డిమాండ్ కు అనుకూలంగా ఉల్లిని కొనుగోలు చేస్తున్నారు. అందుకే రైతులకు ధర ఇవ్వలేకపోతున్నాము." - రాఘవేంద్ర, కమీషన్ ఏజెంట్, దేవరకద్ర వ్యవసాయ మార్కెట్
"దేవరకద్ర వ్యవసాయ మార్కెట్లో గత బుధవారం 2వేల500 బస్తాలు రాగా.. క్వింటా ఉల్లిధర గరిష్టంగా 950 రూపాయలు దాటలేదు. గత ఏడాది ఇదే సమయానికి క్వింటా ఉల్లి 1250 వరకు పలికింది. మరో 3వారాల పాటు ఉల్లి మార్కెట్‌కు రానుంది. డిమాండ్‌ను బట్టి రైతులకు వ్యాపారులే ధర నిర్ణయిస్తారు తప్ప.. నిర్ణీత ధర లేదు". -ఎల్లాస్వామి, దేవరకద్ర వ్యవసాయ మార్కెట్
ఇవీ చదవండి: