అడవులకు అనువైన ప్రాంతంగా విరజిల్లిన మహబూబ్‌నగర్ జిల్లాలో పచ్చదనాన్ని పెంచేందుకు.. ప్రభుత్వం ఐదేళ్లుగా హరితహారం కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఆరో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 60 లక్షల మొక్కలు నాటాలని ఉన్నా.. కోటి మొక్కలు నాటేందుకు లక్ష్యం పెట్టుకుంది యంత్రాంగం.
మయూరి వనం ఆవరణలో
ఇప్పటికే హరితహారం మొదటిరోజే 16 లక్షల మొక్కలు నాటగా... కోటి మొక్కలు నాటేందుకు శాఖల వారిగా లక్ష్యాలను పెట్టుకున్నారు. మొక్కలను సహజసిద్ధంగా పెంచేందుకు విత్తన బంతుల విధానంపై దృష్టి సారించారు అధికారులు. గతంలో ఈ విధానంతో సత్ఫలితాలు ఇవ్వడం వల్ల అడవులకు పూర్వవైభవం తీసుకురావాలనే లక్ష్యంగా మరోసారి ఈ విధానంను అనుసరిస్తున్నారు. అందులో భాగంగా పాలమూరు జిల్లా కేంద్రం సమీపంలోని మయూరి వనం ఆవరణలో రిజర్వ్ ఫారెస్ట్ విత్తన బంతులు వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
కోటి విత్తన బంతుల తయారీ
పుడమితల్లికి పచ్చదనాన్ని అందించేందుకు కోటి విత్తన బంతుల కార్యక్రమాన్ని వేగంగా చేపడుతున్నారు పాలమూరు మహిళా సంఘాలు. ఇప్పటికే విత్తన బంతుల తయారీలో నిమగ్నమయ్యారు. సంఘంలోని పది మంది కనీసం వంద తయారు చేసే విధంగా.. వెయ్యి సంఘాలు లక్ష మందితో సగటున పదిలక్షల చొప్పున కోటి విత్తన బంతులను తయారు చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. దీనితో పదిరోజులలో లక్షమంది సభ్యులు కోటి విత్తన బంతులు తయారు చేయడంలో నిమగ్నమయ్యారు. ఆదివారం నుంచి విత్తన బంతుల తయారీ కార్యక్రమంను ప్రారంభించిన మహిళా సంఘాలు అన్ని మండలాల్లో చురుకుగా కొనసాగిస్తున్నారు. మంగళవారం నాటికే పది లక్షలు దాటగా.. నిర్ధేశించిన సమయంలో విత్తన బంతుల తయారీ పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నారు.
మండలాల పరిధిలో స్థానిక విత్తనాలనే సమకూరుస్తున్నారు. ఈ బంతుల తయారీలో ప్రధానంగా రాగి, మర్రి, జువ్వి, నేల, నల్ల తుమ్మ, చింత, మేడి, వేప తదితర విత్తనాలను ఉపయోగిస్తున్నారు. కోటి విత్తన బంతుల తయారీ పూర్తైన తర్వాత.. వర్షాలు సమృద్ధిగా ఉన్న తరుణంలో వాటిని మయూరి రిజర్వ్ ఫారెస్ట్‌లో జిల్లా యంత్రాంగం నాటనుంది.
ఇవీ చూడండి: ప్రయాణిస్తుండగా చెలరేగిన మంటలు... ఆహుతైన స్కోడాకారు