పింఛన్లు పంపిణీ చేసేచోట కరోనా వైరస్ నియంత్రణకు సిబ్బంది తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని మహబూబ్‌నగర్ జిల్లా అధికార యంత్రాంగం మార్గదర్శకాలు జారీచేసింది. పింఛను సొమ్ము తీసుకోడానికి వచ్చే వారు మాస్కులు ధరించేలా, సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవడంతోపాటు, బయోమెట్రిక్ నమోదు చేసే సమయంలో ప్రతి ఒక్కరికి శానిటైజర్‌తో చేతులు శుభ్రపరచాలన్నారు.
కానీ, కొన్నిచోట్ల సిబ్బంది ఆ సూచనలు పాటించడం లేదు. భూత్పూర్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ భవనంలో పోస్టల్ సిబ్బంది పింఛన్లు పంపిణీ చేశారు. అక్కడకు వచ్చిన లబ్ధిదారులెవరూ సామాజిక దూరం పాటించలేదు. అంతేకాకుండా లబ్ధిదారుల బయోమెట్రిక్ నమోదు సమయంలో శానిటైజర్‌ను కూడా ఉపయోగించకపోవడం గమనార్హం. ఇలాగైతే వైరస్ విజృంభించడానికి అవకాశమిచ్చినట్లే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.