మహబూబ్‌నగర్‌లోని 167వ జాతీయ రహదారి విస్తరణలో భాగంగా జడ్చర్ల నుంచి మరికల్ వరకు పనులు చేపట్టారు. ఇప్పటికే పట్టణంలోని హౌజింగ్ బోర్టు నుంచి ఏనుగొండ వరకు రెండు వైపులా రహదారి నిర్మాణం దాదాపు పూర్తైంది. ఎనుగొండ నుంచి శ్రీనివాస్ కాలనీ మధ్య కేవలం ఒకవైపు పనులు జరిగాయి. మెుదట పట్టణ శివారులో పెద్దగా ట్రాఫిక్ లేకపోవటంతో ఇబ్బందులు ఎదురు కాలేదు. అయితే.. ప్రస్తుతం పట్టణంలో అత్యంత రద్దీగా ఉండే ప్రదేశాల్లో పనులు చేపట్టడంతో నిత్యం ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది.
రహదారి విస్తరణ చేపట్టినప్పుడు వాహనాలు వెళ్లటానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా రోడ్లను తవ్వారు. కూల్చిన భవన శిథిలాలు, విద్యుత్ స్తంభాలను తొలగించకుండా వదిలేశారు. రహదారికి అడ్డుగా ఉన్న దుకాణాలను కొనసాగిస్తున్నారు. వీధి వ్యాపారులు రోడ్డు పక్కన అమ్మకాలు సాగిస్తుండటంతో నిత్యం కిలిమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతున్నాయి.
వాహనాలు నిలిచే కూడళ్లలో కనీసం ట్రాఫిక్ పోలీసులు పర్యవేక్షణ చేయటం లేదని వాహనదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. శ్రీనివాస కాలనీ నుంచి బస్టాండ్ వెళ్లటానికి దాదాపు గంట సమయం పడుతోందని తెలిపారు. ప్రత్యామ్నాయ మార్గాలు లేకపోవడం వల్ల అవస్థలు పడుతున్నామని వాపోతున్నారు. ఇదే మార్గంలో జిల్లా జనరల్ ఆసుపత్రి ఉండటంతో అంబులెన్సులు ట్రాఫిక్‌లో చిక్కుకుంటున్నాయని.. అధికారులు స్పందించి రహదారి విస్తరణ పనులు త్వరలో పూర్తి చేయాలని కోరారు.
ఇదీ చూడండి: రైతు వేదికలు, పల్లె ప్రగతిని దేశ వ్యాప్తంగా అమలు చేయాలి: నామ