కరోనా కట్టడి కోసం అధికారులు, సిబ్బంది యుద్ధం చేసినట్లుగా పనిచేయాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
శనివారం రాత్రి మహబూబ్‌నగర్‌లోని కొవిడ్ నియంత్రణపై జిల్లా కలెక్టర్, ఎస్పీ, వైద్యారోగ్య, సంబంధిత అధికారులతో సమీక్షించారు. రెండో విడత కరోనా ఉద్ధృతంగా ఉందని, జిల్లాలో అన్ని సౌకర్యాలున్నాయని ఆయన గుర్తు చేశారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 17, ఒక్క మహబూబ్‌నగర్‌లోనే ఏడు అంబులెన్స్‌లు ఉన్నాయన్నారు. ఆసుపత్రిలో ఖాళీ పోస్టులు భర్తీ చేశామన్న మంత్రి... ప్రభుత్వ ఆసుపత్రి, మెడికల్ కళాశాలల్లో పడకలు, ఆక్సిజన్ సౌకర్యాలు ఉన్నాయని చెప్పారు. కరోనా కట్టడిలో భాగంగా ప్రతి రోజు ప్రభుత్వ ఆసుపత్రితోపాటు, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉన్న కొవిడ్ రోగులు, ఆక్సిజన్, పడకలు, మందుల వివరాలు సేకరించాలని సూచించారు.
ఎస్వీఎస్లో కూడా ప్రభుత్వం తరఫున కరోనా రోగులకు ఉచిత సేవలు అందించే ఏర్పాటు చేయాలన్నారు. అక్కడ 24 గంటలు వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండేలా చూడాలని చెప్పారు. ఆసుపత్రిలో చేరిన కొవిడ్ రోగులకు పౌష్ఠికాహారం ఇవ్వాలని దిశానిర్దేశం చేశారు. ప్రైవేట్ ఆసుపత్రులు కొవిడ్ రోగుల నుంచి అధిక బిల్లులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు తెలిపారు. అందుబాటులో ఉన్న వైద్యులందరికి షిఫ్ట్ పద్ధతిలో విధులు కేటాయించాలని... రాత్రి సమయంలో ఆసుపత్రికి వచ్చే రోగులను కూడా వెంటనే చూసి చికిత్స అందించాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదేశించారు.
ఇదీ చూడండి: తెరాస-భాజపా శ్రేణుల మధ్య ఘర్షణ, లాఠీ ఛార్జ్