ఇప్పటివరకు మల్టీ నేషనల్ కంపెనీలతో ప్రపంచాన్ని ఆకర్షించిన భాగ్యనగరం.. త్వరలో ప్రపంచ పర్యటకులను ఆకర్షించేందుకు సిద్ధమవుతోంది. లండన్ గ్రేట్ జెయింట్ వీల్ తరహాలో హైదరాబాద్, మహబూబ్‌నగర్‌లో ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించింది. జెయింట్ వీల్స్‌తో పాటు స్కై టవర్స్ కూడా ఏర్పాటు చేయనున్నట్టు పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ వివరించారు.
మొదటి దశలో దుర్గం చెరువు, ట్యాంక్ బండ్ వద్ద జెయింట్ వీల్స్ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. హైదరాబాద్‌కు ఎన్నో ఇంటర్నేషనల్ కంపెనీలు రావటం.. ఐటీతో పాటు అన్ని రంగాల్లో నగరం అభివృద్ధి చెందుతోందని.. ఇదే తరహాలో పర్యాటకంగా కూడా అంతర్జాతీయ పర్యటకులను ఆకర్శించేలా ఈ నిర్మాణాలు చేపట్టనున్నట్లు తెలిపారు.
లండన్ తరహాలో అతిపెద్ద జెయింట్ వీల్స్, స్కై టవర్స్: వీటి నిర్మాణాల కోసం స్విట్జర్లాండ్‌కు చెందిన ఇంటామిన్ ఎమ్యూజ్‌మెంట్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ జరాల్డ్ స్లేన్డర్‌తో మహబూబ్‌నగర్‌లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమావేశమయ్యారు. ఈ మేరకు సంస్థ పలు ప్రతిపాదనలను మంత్రికి వివరించింది. కేబినెట్లో చర్చించి వీటిపై తుది ఆమోదం తీసుకోనున్నారు.
పర్యాటకంగా ఎంతో అభివృద్ధి: త్వరలోే ఈ ప్రతిపాదనలను సీఎం కేసీఆర్‌కు సమర్పిస్తామని శ్రీనివాస్‌గౌడ్ చెప్పారు. అనంతరం వీటి ఏర్పాటు కోసం.. ప్రభుత్వ ఆధ్వర్యంలో లేదా ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో నిర్వహించేందుకు నిర్ణయం తీసుకుంటామని వివరించారు. వీటి ఏర్పాటు వల్ల రాష్ట్రం పర్యాటకంగా ఎంతో అభివృద్ధి చెందుతుందని అన్నారు. తద్వారా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని వివరించారు. రెండోదశలో కొండపోచమ్మసాగర్, పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పరిధి ఉదండాపూర్, కర్వెన రిజర్వాయర్లు, మహబూబ్‌నగర్‌లో జెయింట్ వీల్స్‌ను ఏర్పాటు చేస్తామని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ వెల్లడించారు.
జెయింట్ వీల్స్, స్కై టవర్స్ ఏర్పాటు చేయడంలో తమ సంస్థ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిందని ఇంటామిన్ ఎమ్యూజ్‌మెంట్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ జరాల్డ్ స్లేన్డర్ తెలిపారు. హైదరాబాద్‌లో అంతర్జాతీయ స్థాయి పర్యాటకాన్ని అభివృద్ధి చేసే అంశంలో తమ వంతు పాత్ర పోషిస్తామని జరాల్డ్ స్లేన్డర్ చెప్పారు.
"ప్రపంచదేశాలు, అభివృద్ధి చెందిన దేశాల మాదిరిగా లండన్‌లోని వాటి తరహాలో జెయింట్ వీల్స్, స్కైటవర్స్ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తాం. తొలుత దుర్గం చెరువు, ట్యాంక్‌బండ్‌లో ఏర్పాటు చేయనున్నాం. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనల మేరకు వీటి కోసం చర్యలు చేపట్టాం. ఆ తర్వాత మహబూబ్‌నగర్‌లో చేపడతాం. స్విట్జర్లాండ్‌కు చెందిన ఇంటామిన్ ఎమ్యూజ్‌మెంట్ సంస్థ ప్రతిపాదనలు తయారు చేసింది. వీటిని సీఎంకు సమర్పిస్తాం. ప్రభుత్వ ఆధ్వర్యంలో లేదా ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంలో ఏర్పాటుచేయాలా అన్నదానిపై నిర్ణయం తీసుకుంటాం. పర్యాటకంగా అభివృద్ధి చెందడం వల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయి." - శ్రీనివాస్‌గౌడ్, పర్యాటకశాఖ మంత్రి
ఇవీ చదవండి: ఫారిన్ కాదు.. మన హైదరాబాదే.. త్వరలోనే డబుల్ డెక్కర్ బస్సుల రయ్ రయ్..
ఉప్పల్‌కు కొత్తందం.. సిద్ధమైన స్కైవాక్
1972లో డిగ్రీ పూర్తి.. 51ఏళ్ల తర్వాత పట్టా అందుకున్న ముఖ్యమంత్రి