కరోనా రోగులు 10 మంది కంటే ఎక్కువ మంది గ్రామాల్లో ఉంటే అక్కడికే వైద్యులను పంపాలని పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సూచించారు. డాక్టర్ వెళ్లలేని పక్షంలో ఫోన్ ద్వారా వారి యోగక్షేమాలను కనుక్కుని.. మనోధైర్యం నింపాలని అన్నారు. మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల జడ్పీ ఛైర్మన్‌లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, షాద్ నగర్ అధికారులతో కరోనాపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
లాక్‌డౌన్‌లో ప్రజలకు అవసరమైన సరుకులు, కూరగాయలు అందుబాటులో ఉండేలా చూడాలని, ధరలు నియంత్రణలో ఉంచాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో అవసరం ఉంటేనే ఆక్సిజన్‌ను వినియోగించాలని సూచించారు. ఈ సందర్భంగా అన్ని జిల్లాల్లో కొవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. మంగళవారం నాటికి షాద్‌నగర్‌లో 30 పడకలు ఆక్సిజన్‌తో సిద్ధం చేసుకోవాలని దిశానిర్దేశం చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని అన్నారు.
ఇదీ చూడండి: 'ప్రైవేటు ఆస్పత్రుల నిర్లక్ష్యం వల్లే "నిండుచూలాలు" మృతి'