కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలే బలపరుస్తున్నారని... అందుకే అన్ని ఎన్నికల్లో తెరాసనే గెలుస్తోందని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఆవరణలో డీసీసీబీ, డీసీఎంఎస్ ఎన్నికల సందర్బంగా ఎన్నికైన డైరెక్టర్లకు నియమాక పత్రాలు అందజేశారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా తెరాస పాలన సాగుతోందని మంత్రి అన్నారు.
ప్రతిపక్షాల ఆరోపణల్లో వాస్తవం లేదన్న ఆయన రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలో 20 డీసీసీబీ డైరెక్టర్ స్థానాలకు.. 15 స్థానాల్లో ఒకే ఒక్క నామపత్రం దాఖలు కాగా వారంతా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన 5 స్థానాలకు నామపత్రాలు దాఖలు కాలేదు. డీసీఎంఎస్‌లో 10 డైరెక్టర్లకు 7 స్థానాల్లో ఒక్కో నామినేషన్ దాఖలైంది. వీరంతా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన 3 స్థానాలకు నామపత్రాలు దాఖలు కాలేదు. 15 మంది డైరెక్టర్లు ఎన్నికై కోరం ఉండటం వల్ల ఈనెల 29న డీసీసీబీ ఛైర్మన్ ఎన్నిక జరగనుంది.