మహబూబ్‌నగర్ పట్టణంలో జాతీయ రహదారి విస్తరణలో భాగంగా భూములు కోల్పోతున్న వారికి నాలుగు రెట్ల విలువతో టీడీఆర్(ట్రాన్స్ఫర్ ఆఫ్ డెవలప్మెంట్ రైట్స్) సర్టిఫికెట్లు జారీ చేస్తున్నామని... భవిష్యత్తులో అవి ఎంతగానో ఉపయోగపడతాయని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అభిప్రాయపడ్డారు. మహబూబ్ నగర్ పట్టణంలో రోడ్డు విస్తరణలో భాగంగా ఇండ్లు కోల్పోతున్న వారికి టీడీఆర్ బాండ్లను మంత్రి అందజేశారు. గతంలో రోడ్ల విస్తరణలో భూములు, ఇండ్లు, దుకాణాలు కోల్పోయిన వారికి ఇలాంటి పరిహారం అందలేదని మహబూబ్‌నగర్‌లోనే తొలిసారిగా అమలు చేస్తున్నట్లు ఆయన గుర్తు చేశారు. కల్వకుర్తి నుంచి జడ్చర్ల వరకూ ఇళ్లు,స్థలాలూ కోల్పోయిన వారికీ పరిహారం ఇవ్వలేదన్న ఆయన... తీవ్రంగా నష్టపోతారన్న ఉద్దేశంతోనే ఈ పాలమూరు పట్టణంలో టీడీఆర్‌లు జారీ చేసినట్లు ఆయన చెప్పారు.
టీడీఆర్ సర్టిఫికెట్ విలువ హైదరాబాద్‌లో సొంత ఇండ్లు ఉన్న వారిని అడిగి తెలుసుకోవాలని అన్నారు. ఏ అభివృద్ధి పని చేసినా అడ్డుకునే వాళ్లుంటారని వారిని నమ్మి మోసపోవద్దన్నారు. స్వచ్ఛందంగా సమ్మతి తెలిపిన వారికి టీడీఆర్ బాండ్లు తక్షణమే మంజూరు చేస్తున్నామని గుర్తు చేశారు. టీడీఆర్‌కు ముందుకు రాని వాళ్లు పునరాలోచించుకోవాలని కోరారు. జిల్లాను అన్ని రకాలుగా అభివృద్ధిపరచి రూపురేఖలు మారుస్తానని అన్నారు. జిల్లా కలెక్టర్ వెంకట్రావు మాట్లాడుతూ రోడ్డు విస్తరణలో స్థలం కోల్పోయిన వారికి టీడీఆర్ అనేది మంచి అవకాశమని, భవిష్యత్తులో చాలా ఉపయోగకరమైన సర్టిఫికెట్ అని తెలిపారు.
ఇవీ చూడండి: 'పౌల్ట్రీ రంగానికి ప్రభుత్వం అండగా ఉంటుంది'