పౌల్ట్రీ రంగానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ భరోసానిచ్చారు. హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్‌లోని పశుసంవర్ధక శాఖ సంచాలకుల కార్యాలయంలో శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. క్వింటాల్ మక్కాల ధర రూ.1525గా నిర్ణయించామన్నారు మంత్రి. 5 లక్షల మెట్రిక్ టన్నుల మక్కలను పౌల్ట్రీ పరిశ్రమకు సరఫరా చేస్తామని తెలిపారు.
కరోనా కారణంగా నష్టపోయే పరిస్థితుల్లోకి వచ్చిన పౌల్ట్రీ రంగం ప్రభుత్వం చొరవతో పుంజుకుందని మంత్రి వివరించారు. విద్యుత్ సబ్సీడీ కింద ఇప్పటికే రూ. 20 కోట్లు మంజూరు చేసినట్టు తెలిపారు. లాక్‌డౌన్ ముగిసిన తర్వాత పలు రాష్ట్రాల్లో అమలవుతున్న పౌల్ట్రీ పాలసీపై అధ్యయనం చేస్తామన్నారు. సమావేశంలో మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్‌రెడ్డితో పాటు పౌల్ట్రీ రంగ ప్రతినిధులు పాల్గొన్నారు.