మహబూబ్నగర్ జిల్లా ఆస్పత్రిలోని ప్రత్యేక వార్డులో కరోనా ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షలను మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. గతంలో కరోనా పరీక్షల కోసం పూణే వెళ్లేవారని, ఆ తర్వాత హైదరాబాద్ గాంధీకి వెళ్లాల్సి వచ్చేదని.. ఇప్పుడు ఆ పరీక్షలు మహబూబ్నగర్ ఆస్పత్రిలోనే నిర్వహిస్తున్నామని చెప్పారు.
లక్షణాలు ఉన్నవారు మాత్రమే
ప్రభుత్వాసుపత్రిలో కరోనా కోసం ప్రత్యేకంగా 100 పడకల వార్డును ఏర్పాటు చేశామని తెలిపారు. కరోనా ఉందని అనుమానం వస్తే భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరు పరీక్షల కోసం రావద్దని తెలిపారు. జ్వరం, గొంతు నొప్పి, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉన్నవారు మాత్రమే పరీక్షలు చేయించుకోవాలని మంత్రి సూచించారు. కరోనా వచ్చిన వారిని రోగిలా కాకుండా మానవత్వంతో చూడాలని చెప్పారు.
ప్రతి ఆదివారం 10 నిమిషాలు
జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పేద ప్రజలకు మంత్రి దోమ తెరలు పంపిణీ చేశారు. పట్టణాల్లో ప్రజలు వ్యాధులకు గురికాకుండా ప్రతి ఆదివారం 10 నిమిషాలు ఇంట్లో పరిసరాలు శుభ్రం చేసుకోవాలన్నారు. వర్షాకాలం సీజన్ కారణంగా వచ్చే జబ్బులను ఎదుర్కొనేందుకు వైద్య ఆరోగ్య శాఖ ద్వారా దోమ తెరలను పంపిణీ చేస్తున్నామని చెప్పారు. వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
ఇదీ చూడండి : కరోనాతో ఏదో జరిగి పోతుందనే భయం వద్దు : ఎంపీ బండి సంజయ్