హైదరాబాద్ ఆస్పత్రులకు దీటుగా మహబూబ్‌నగర్ ప్రభుత్వాసుపత్రిలో వైద్యం అందిస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. ప్రభుత్వాస్పత్రిలో ఏర్పాటు చేసిన 200 పడకల ఆక్సిజన్ వార్డును మంత్రి ప్రారంభించారు. ఉస్మానియా తరహాలో ప్రభుత్వాస్పత్రిలో 500 పడకల వరకు ఆక్సిజన్ సౌకర్యం ఉందని, 60 ఐసీయూ పడకలను ఏర్పాటు చేశామన్నారు. నూతన ఆసుపత్రితో పాటు మరిన్ని సదుపాయాలు సమకూర్చుకునేందుకు ప్రతిపాదనలు తయారు చేశామని... తమిళనాడు, కేరళ తరహాలో ఆసుపత్రులను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. దేశవ్యాప్తంగా వైద్యులపై జరుగుతున్న దాడులను నిలిపివేయాలని ఐఎంఏ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొని వారికి సంఘీభావం తెలిపారు. వైద్యులకు రక్షణ కలిగించే భాద్యత ప్రభుత్వంపై ఉందన్నారు. మూడో దశలో కొవిడ్ మహమ్మారి విజృంభిస్తే.. మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్న ప్రైవేటు ఆసుపత్రులన్నీ ఏకమై ప్రజలకు సేవలందించాలని సూచించారు. అందుకనుగుణంగా అవసరమైతే ఆసుపత్రులకు అవసరమైన సహాయ సహకారాలు, మందులు సమకూరుస్తామన్నారు.
అంతకుముందు హరితహారంలో భాగంగా మహబూబ్‌నగర్ బైపాస్ రహదారిపై మొక్కలు నాటడాన్ని ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించే బాధ్యత కూడా తీసుకోవాలన్నారు. రాబోయే వారం రోజుల్లో హరితహారం కింద జిల్లాలో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు మంత్రి వెల్లడించారు. ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటేలా పురపాలక అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు.
ఇదీ చదవండి: CM KCR: సర్పంచ్‌తో ఫోన్లో మాట్లాడిన ముఖ్యమంత్రి కేసీఆర్