ఒకప్పుడు వసతుల్లేక చెట్లకింద చదువులు ఉండేవని.. ప్రస్తుతం సకల సౌకర్యాలతో నాణ్యమైన విద్య అందిస్తున్నామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. వాటిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మహబూబ్ నగర్ పోలీస్ లైన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉచిత పాఠ్యపుస్తకాలను ఆయన పంపిణీ చేశారు.
ఒకప్పుడు సర్కారీ బడుల్లో వసతులు ఉండేవి కాదని.. ఇప్పుడు స్కూళ్లలో అన్ని వసతులు కల్పించామని మంత్రి పేర్కొన్నారు. వసతి గృహాల్లోనూ చక్కని ఆహారం, నాణ్యమైన విద్య, సకల వసతులు కల్పిస్తున్నామని ఆయన గుర్తు చేశారు. మహబూబ్ నగర్‌ను హైదరాబాద్ తరహాలో తీర్చిదిద్దే ఉద్దేశంతో వైద్య కళాశాల, పాలమూరు విశ్వవిద్యాలయం తీసుకువచ్చామని త్వరలో ఐటీ పార్క్ సైతం అందుబాటులోకి వస్తుందన్నారు. అంతకుముందు తెరాస పార్టీ కార్యాలయంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో కాంగ్రెస్, భాజపా పార్టీ కార్యకర్తలు 200 మంది తెరాసలో చేరారు.
ఇదీ చూడండి: ఇంకెంత కాలం ఇంట్లో ఉండాలని పేచీ పెడుతున్నాడు?