మహబూబ్ నగర్ ప్రభుత్వ బాలుర కళాశాల, ఎంవీఎస్ డిగ్రీ కళాశాలలో రూ.13 లక్షలతో బొటానికల్ గార్డెన్లు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. హరితహారంలో భాగంగా స్థానిక ప్రభుత్వ బాలుర కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. కళాశాలల్లో ఏర్పాటు చేస్తున్న బొటానికల్ గార్డెన్లు విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన అన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో కేసీఆర్ పేరుతో దేశంలోనే అతిపెద్ద అర్బన్ ఎకో పార్క్ ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. బైపీసీ గ్రూప్ విద్యార్థులకు బొటానికల్ గార్డెన్ బాగా ఉపయోగపడుతుందని, విద్యార్థులంతా క్షేత్రాన్ని సందర్శించాలని మంత్రి సూచించారు.
అనంతరం గడియారం చౌరస్తా జంక్షన్ విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. విస్తరణ పనులకు సంబంధించిన మ్యాప్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. దుకాణాదారుల వద్దకు వెళ్లి యజమానులతో మాట్లాడారు. అందరూ కచ్చితంగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు. కొవిడ్-19 నిబంధనలు పాటిస్తూ విక్రయాలు కొనసాగించాలని కోరారు. మాస్కులు ధరించని వారికి వస్తువులను అమ్మరాదని, పండ్ల వ్యాపారులు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ అమ్మకాలు జరపాలని మంత్రి సూచించారు.
ఇవీ చూడండి: 'రైతును లారీతో గుద్ది చంపిన ఇసుక మాఫియా'