Harish Rao Inaugurated Balanagar CHC: భాజపా తప్పుడు ప్రచారం చేస్తోందని... వాటిని తిప్పి కొట్టేందుకు సిద్ధంగా ఉండాలని మంత్రి హరీశ్ రావు అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. భాజపా దేశ వ్యాప్తంగా 157 మెడికల్ కళాశాలలను మంజూరు చేస్తే.. తెలంగాణకు మొండి చెయ్యి చూపించారని ధ్వజమెత్తారు. వైద్యారోగ్య శాఖ పనితీరుపై నీతి ఆయోగ్ నివేదిక ఇస్తే... దేశంలోనే తెలంగాణ మూడో స్థానంలో ఉందని హర్షం వ్యక్తం చేశారు.
ప్రధాని ఎంపీగా ఉన్న యూపీలో...
ప్రధానమంత్రి ఎంపీగా ఉండి డబుల్ ఇంజిన్ గ్రోత్ అని చెప్పుకుంటున్న ఉత్తర్‌ప్రదేశ్ వైద్య రంగంలో చివరి స్థానంలో ఉందని మంత్రి హరీశ్ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేస్తుండగా.. అందులో 3 కళాశాలలను ఉమ్మడి మహబూబ్‌నగర్‌కు కేటాయించామన్నారు. నెల రోజుల్లోనే మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో 900 పడకలతో రూ. 211 కోట్లు వెచ్చించి.. ఆధునిక ఆసుపత్రిని నిర్మించేందుకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారని వివరించారు.
ప్రజలను కాపాడుకుందాం...
వచ్చే రెండు మూడు వారాలు ప్రజలను జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ప్రజాప్రతినిధులు, అధికారులకు ఆయన సూచించారు. ప్రత్యేక డ్రైవ్‌లు ఏర్పాటు చేసి మిగిలిపోయిన రెండో డోసు వ్యాక్సినేషన్‌ను వంద శాతం పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. కరోనా థర్డ్ వేవ్‌లో వ్యాప్తి ఎక్కువ ఉన్నా... తీవ్రత తక్కువ ఉందని పేర్కొన్నారు. కొంత మంది భయపడి ప్రైవేటు ఆసుపత్రిలో చేరి.. డబ్బులు పోగొట్టుకోవద్దని హితవు పలికారు.
అన్ని సిద్ధంగా ఉంచాం...
రాష్ట్రంలో 2లక్షల 50 వేల రెమిడిసివిర్ ఇంజక్షన్‌లు, 2 కోట్ల హోం ఐసోలేషన్ కిట్లను సిద్ధంగా ఉంచామని హరీశ్ పేర్కొన్నారు. ఏఎన్‌ఎంలు కరోనా పరీక్షలు నిర్వహించి... పాజిటివ్ వస్తే కిట్‌లను అందజేయడంతో పాటు ప్రతి రోజు పర్యవేక్షిస్తారని వివరించారు. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో ఆధునిక వసతులతో అభివృద్ది చేసేందుకు చేపడుతున్న మన ఊరు- మన బడి కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు రూ.7,500 కోట్లు మంజురు చేశామన్నారు. తలసరి ఆదాయంలో దక్షిణ భారత దేశంలో మనం ముందు వరుసలో ఉన్నామన్నారు.
ఇవీ చూడండి: