హైదరాబాద్ ట్యాంక్ బండ్లా ప్రతి నియోజక వర్గంలో మినీ ట్యాంక్ బండ్ నిర్మించాలన్న సర్కారు సంకల్పం క్షేత్రస్థాయిలో కార్యరూపం దాల్చడం లేదు. కొన్ని నియోజక వర్గాల్లో మినీ ట్యాంక్ బండ్ నిర్మాణాలు పట్టణ ప్రజలకు ఆహ్లాదాన్ని పంచుతుంటే... మరికొన్ని చోట్ల ఏళ్లు గడుస్తున్నా పూర్తి కావడం లేదు. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రలో ఐదున్నర కోట్లతో మినీ ట్యాంక్ బండ్ నిర్మాణాన్ని 2017లో చేపట్టారు. పెద్ద చెరువుపై కోటిన్నర ఖర్చు చేసి కట్ట బలోపేతం, వెడల్పు పెంచడం, పూడిక తీత, జంగిల్ కటింగ్ లాంటి పనులు చేపట్టారు. ఆ తర్వాత గుత్తేదారు పనుల్ని మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయారు. మరో గుత్తేదారుకు పనులు అప్పగించినా.. ఇంకా పనులు మొదలు కాలేదు. చేసిన పనులు మళ్లీ మొదటికొచ్చాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.
నిధులు విడుదల చేయాలి..
నారాయణపేట జిల్లా మరికల్లో నాలుగున్నర కోట్లతో మినీ ట్యాంక్ బండ్ నిర్మించాలని పనులు ప్రారంభించారు. సుమారు కోటి రూపాయలతో వివిధ పనులు చేశారు. రోడ్డు నిర్మాణం, అలుగు, తూముల మరమ్మతులు, వాకింగ్, సైక్లింగ్ ట్రాక్లు సహా సుందరీకరణ పనులు పూర్తి చేయాల్సి ఉంది. బిల్లులు రాక ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయని, వెంటనే ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని స్థానిక ప్రజాప్రతినిధులు విజ్ఞప్తి చేస్తున్నారు. మక్తల్‌లో నిర్మిస్తున్న మినీ ట్యాంక్ బండ్ నిర్మాణం సైతం దాదాపుగా పూర్తైందని అధికారులు చెబుతున్నా.. కొన్ని పనులు చేయాల్సి ఉంది.
వేగం మందగించింది..
మినీ ట్యాంక్ బండ్లలో కట్ట వెడల్పు 6 మీటర్ల వరకు పెంచాలి. ప్రతి బండ్‌కు బతుకమ్మ ఘాట్, బోటింగ్ కోసం జెట్టి తప్పనిసరి ఏర్పాటు చేయాలి. ఆహ్లాదం కోసం పార్కులు, పిల్లల ఆట వస్తువులు ఏర్పాటు చేయాలి. ఇలాంటి వసతులతో మూడు చోట్ల మాత్రమే ప్రస్తుతం మినీ ట్యాంక్ బండ్ల నిర్మాణం పూర్తి కాగా.. మిలిగిన చోట్ల పనుల్లో వేగం మందగించింది. మహబూబ్ నగర్లో పూర్తి కాగా, దేవరకద్ర, జడ్చర్లలో అసంపూర్తిగా ఉన్నాయి. గద్వాలలో పూర్తి కాగా.. అయిజలో మినీ ట్యాంక్ బండ్ పూర్తి కావాల్సి ఉంది. నాగర్ కర్నూల్ జిల్లాలో కొల్లాపూర్, అచ్చంపేట పనులు నత్తనడకన సాగుతున్నాయి. వనపర్తిలో 60 శాతం పనులు పూర్తి చేయాల్సి ఉంది.
సకాలంలో నిధులు రాకపోవడం, చెరువులు నిండటం, గుత్తేదారులు, అధికారుల అలసత్వం కారణంగా పట్టణ ప్రజలకు ఆహ్లాదాన్ని పంచాల్సిన మినీ ట్యాంక్ బండ్లు అందని ద్రాక్షలుగానే మిగిలిపోతున్నాయి.
ఇదీ చూడండి: 'రైతులకు పరిహారం చెల్లింపుపై ఏం చర్యలు తీసుకున్నారు'