రెండో తిరుపతిగా పేరుగాంచిన మన్యంకొండ... ఒకప్పుడు మునులకొండగా పిలిచేవారు. ప్రకృతి సిద్ధమైన గుట్టలతో అత్యంత రమణీయంగా ఉన్న ఈ ప్రాంతాన్ని లోక కల్యాణం కోసం ఎంచుకున్న మునులు తపస్సు చేశారు. వారిని అనుగ్రహించేందుకు కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వరుడు ఆదిశేషుడి అవతారంలో స్వయంభూగా వెలిశాడు.
నర్సింహ యోగి, రామ యోగి, కాశీరాయలు, వీరప్పయ్య, హనమద్దాసు వంటి మునులు తపస్సు చేసి సిద్ధిని పొందినట్లుగా చరిత్ర చెబుతోంది. స్వామివారు కొండపైన అడుగు పెట్టినప్పటి పాదాలు, ప్రకృతి సిద్ధంగా వెలసిన కోనేరు, స్వయంభూగా వెలిసిన గుహా, సహాజంగా కనిపించే స్వామి విగ్రహాలు, పాదాలు, కోనేరు, గుడి ప్రతీతికెక్కాయి.
మన్యానికి వీరభద్రుడే క్షేత్రపాలకుడు...
శ్రీ రంగానికి సమీపంలోని అళహరి గ్రామ నివాసి అళహరి కేవశవయ్యకు స్వామి కలలో కనిపించి తాను మునులకొండలో వెలశానని చెప్పినట్లు స్థానికుల విశ్వాసం. అప్పటి నుంచి అళహరి వంశీయులే మన్యంకొండకు వంశపారంపర్య ధర్మకర్తలుగా కొనసాగుతున్నారు. మన్యంకొండకు వీరభద్రుడు క్షేత్రపాలకుడు కాగా... శివపార్వతుల గుడి సైతం కొండపైనే ఉంది. ముని హనుమద్దాసుల ఆజ్ఞమేరకు కొండకు దిగువన అలివేలు మంగమ్మ ఆలయాన్ని నిర్మించారు.
తిరుచ్చి సేవతో మెుదలు...
మన్యంకొండలో ఆపద మెుక్కుల వాడైన కలియుగ వైకుంఠుడిని దర్శించడానికి ఏటేటా భక్తులు తండోపతండాలుగా వస్తుంటారు. నెల రోజుల పాటు నిర్వహించే ఈ బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు చేయడంలో ఆధికార యంత్రాంగం నిమగ్నమైంది. మాఘ శుద్ధ దశమి నుంచి పాల్గుణ బహుళ తదియ వరకు స్వామి బ్రహ్మోత్సవాలు కన్నులవిందుగా జరుగుతాయి. ఈ నెల 4 నుంచి మార్చి 13 వరకు స్వామి వారి బ్రహ్మోత్సవాలను విశేషంగా నిర్వహిస్తున్నారు. బ్రహ్మోత్సావాల్లో ప్రధాన ఘట్టమైన గరుడ వాహన సేవ రథోత్సవం ఈ నెల 9న నిర్వహించనున్నారు. తొలి రోజు తిరుచ్చి సేవతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి.
ప్రతిరోజు వరుసగా సూర్య ప్రభ వాహన సేవ, శేష వాహనసేవ, గజ వాహనసేవ, హనుమత్ సేవ, ప్రభోత్సవం, గరుడ వాహనసేవ, రథోత్సవం, అశ్వ వాహనసేవ, వసంతోత్సవం, అవభృత సేవలు నిర్వహించనున్నారు. లక్షల సంఖ్యలో భక్తులు హాజరుకానున్నారని అధికారుల అంచనా. అందుకు అనుగుణంగానే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
తిరుమలలో చేసినట్లే...మన్యంకొండలోనూ
తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామికి ఏ విధంగా పూజలు నిర్వహిస్తారో... మన్యంకొండలోనూ అలాంటి పూజా కార్యక్రమాలు చేపడతారు. ప్రతి పౌర్ణమి రోజున స్వామి వారికి కల్యాణం నిర్వహిస్తారు. శని, ఆది వారాల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. స్వామిని దర్శిస్తే కోరిన కోర్కెలు తీరి ఆయురారోగ్యం, అష్టైశ్వర్యాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. బ్రహ్మోత్సవాలకు సుమారు నాలుగు లక్షలకు పైగా భక్తులు హాజరుకానున్నారు. బ్రహ్మోత్సవాల్లో అలివేలు మంగతాయారు తిరు కల్యాణం కీలమైనది.
ఇవీ చూడండి : 'నీది వేరే కులం... నిన్నెలా పెళ్లి చేసుకుంటాననుకున్నావ్'