పారిశుద్ధ్య నిర్వహణ పట్ల నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలకు ఉపక్రమించారు మహబూబ్‌నగర్ జల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావు. జిల్లాలోని మహమ్మదాబాద్ గ్రామ పంచాయతీ కార్యదర్శి రాఘవేందర్ రెడ్డిని తక్షణం విధుల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేశారు. గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు కొన్ని రోజుల నుంచి చెత్త ఉన్నప్పటికీ తొలగించటం లేదని గ్రామస్థులు ఫొటోతో సహా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా.. స్పందించిన ఆయన చర్యలు తీసుకున్నారు.
గ్రామాలలో పారిశుద్ధ్య నిర్వహణ విషయమై ప్రతి వారం అదనపు కలెక్టర్ల స్థాయిలో సమీక్షలు నిర్వహించినప్పటికీ నిర్లక్ష్యం వహించడం తీవ్రమైన చర్య అని కలెక్టర్ అన్నారు. మండల పంచాయతీ అధికారి శంకర్ నాయక్‌కు, డివిజనల్ పంచాయతీ అధికారికి, సర్పంచ్ గుర్రం పార్వతమ్మలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ విషయంలో సంతృప్తికరమైన సమాధానాలు సమర్పించకుంటే ఈ ముగ్గురిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.
ఇవీ చూడండి: ఈటీవీ భారత్ కథనానికి సీఎం సతీమణి స్పందన.. పేద కుటుంబానికి ఆర్థిక సాయం