ధాన్యం కొనుగోళ్లు లేక వరి రైతులు ఎంతగా ఇబ్బందులు పడుతున్నారో... మొక్కజొన్న రైతులు సైతం కొనుగోలు చేసే దిక్కులేక తీవ్రంగా నష్టపోతున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మహబూబ్నగర్ జిల్లాలో 37వేలు.. నాగర్ కర్నూల్ జిల్లాలో 50 వేలు, వనపర్తి జిల్లాలో 11వేలు.. జోగులాంబ గద్వాల జిల్లాలో 10వేల ఎకరాల్లో రైతులు మొక్కజొన్నను సాగు చేశారు. వానాకాలంలో ముందుగానే మొక్కజొన్న సాగు చేసిన రైతులు... ఇప్పటికే పంటను అమ్ముకోగా... అక్టోబర్, నవంబర్ మాసాల్లో దిగుబడి చేతికొచ్చిన రైతులు మాత్రం నానా అవస్థలు పడుతున్నారు. పంటను కోసి కల్లాల్లో కుప్పలుగా ఆరబోస్తున్నారు. కానీ రెండు నెలలుగా చల్లని వాతావరణం, తెరపిలేని ముసురు, అప్పుడప్పడు కురుస్తున్న వానలతో... నిర్ణీత తేమశాతం రావడం లేదు. దీంతో అటు ప్రైవేటు వ్యాపారులు, దళారులు అలాంటి మొక్కజొన్నను కొనుగోలు చేయడం లేదు. ఆరబెట్టడం, కుప్పులు పోయడమే తప్ప.. కనీస మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేసే దిక్కులేకుండా పోయిందని రైతులు వాపోతున్నారు. వనపర్తి జిల్లా చిన్నంబావి మండలంలో... వరుసగా వారం రోజుల పాటు రైతులు ఆందోళనకు దిగినా పట్టించుకున్న నాథుడు లేడు.
మొలకెత్తుతోన్న మక్కలు..
కొనే దిక్కులేకపోవడంతో మొక్కజొన్న ఎక్కడికక్కడ మొలకెత్తుతోంది. చల్లని వాతావరణంగా పంట ఫంగస్ బారిన పడుతోంది. గింజ రంగు మారితే వచ్చే ధర కూడా రాదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అన్ని అనుకూలిస్తే ఎకరాకు 10 నుంచి 15 క్వింటాళ్ల దిగుబడి రావాలి. కానీ సకాలంలో వర్షాలు కురవక.. దిగుబడి ఐదారు క్వింటాళ్లకు పడిపోయింది. చేతికొచ్చిన పంటనూ కొనేవాళ్లూ కరవయ్యారు. చేసేది లేక కొందరు తక్కువ ధరకే దళారులకు అమ్ముకుంటున్నారు. మొక్కజొన్నకు ప్రభుత్వం కనీస మద్దతు ధర 1870రూపాయలు ప్రకటించగా... 1200 నుంచి 1400 మాత్రమే ప్రస్తుతం మొక్కజొన్న ధర పలుకుతోంది. ఆ ధరకు కూడా ఎవరూ కొనడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం వేయొద్దని చెప్పినా..
గత వానాకాలంలో మొక్కజొన్న వేయొద్దని ప్రభుత్వం సూచించినా పండించిన రైతుల నుంచి మాత్రం... కొనుగోలు కేంద్రాల ద్వారా మద్దతు ధరకు కొనుగోలు చేసింది. ఈ ఏడాది ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు లేకపోవడంతో... ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎక్కడా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు తెరచుకోలేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలుకు ఆదేశాలివ్వాలని రైతులు కోరుతున్నారు.
ఇదీ చూడండి: