మహబూబ్‌నగర్ జిల్లా కోయిలకొండ మండలం గార్లపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ ఎస్.వెంకట్రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల సిలబస్ పూర్తి చేయటాన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు రానున్న రెండు నెలలు పాటు ఎలాంటి సెలవులు పెట్టకూడదని కోరారు. నిరంతరంగా పాఠశాలలకు వచ్చినట్లయితే సిలబస్ పూర్తి చేసేందుకు అవకాశం ఉంటుందని కలెక్టర్ పేర్కొన్నారు.
గత వారం రోజులుగా పాఠశాలల ఆకస్మిక తనిఖీలో భాగంగా చాలా మంది ఉపాధ్యాయులు చిన్న చిన్న కారణాలతో సెలవు పెడుతుండటం గమనించానని కలెక్టర్ తెలిపారు. ఇది మంచి పద్ధతి కాదన్నారు. జిల్లా స్థాయి అధికారులందరూ తరుచూ పాఠశాలలు, కళాశాలలు, కేజీబీవీ కేంద్రాల తనిఖీని తీవ్రతరం చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ..
అంతకుముందు కోయిల్‌కొండ మండలం ఆవతలగడ్డ తండాలో ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పిల్లల పెరుగుదల, ఎత్తు, బరువులను పరిశీలించారు. పోషకాహారలోపంతో బాధపడే పిల్లల బరువు, ఎత్తులను పెంచేలా షౌష్టికాహారం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఇదీ చదవండి: సాగర్‌లో ఘన విజయం సాధించాల్సిందే: కేసీఆర్