వర్షాలతో అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రజలకు ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలని మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ వెంకట్రావు ఆదేశించారు. జడ్చర్లలో పర్యటించిన కలెక్టర్... రెవెన్యూ శాఖ, వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. వర్షాల కారణంగా నెలకొన్న పరిస్థితిని ఆరా తీశారు. రైతు వేదికల నిర్మాణం పనులు దసరా వరకు పూర్తిచేయాలని అధికారులకు ఆదేశించారు.
ప్రస్తుతం కొనసాగుతున్న వర్షాలు తగ్గిన అనంతరం... పనులు వేగంగా కొనసాగించాలని అధికారులకు సూచించారు. వర్షాలతో ధరణి సర్వేకు ఆటంకం కలుగుతుందని కమిషనర్ కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం 127 వ నంబర్ జాతీయ రహదారిపై గంగాపూర్ సమీపంలో వర్షాలకు దెబ్బతిన్న వరి పంటలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి పంట నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు.
జడ్చర్ల నియోజకవర్గంలో వర్షాలతో ప్రాణ నష్టం జరగకపోయినా... పంట నష్టం తీవ్రంగా ఉందని అధికారులు తెలిపారు. దాదాపుగా ఆరు వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని కలెక్టర్కు వివరించారు. ఈ కార్యక్రమాల్లో తాహసీల్దార్ లక్ష్మీనారాయణ, పురపాలక కమిషనర్ సునీత, వ్యవసాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.