రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలపై అన్ని మున్సిపాలిటీలు, పంచాయతీల పరిధిలో నిర్మాణాల వివరాలు ఈనెల 30లోగా ఆన్లైన్ చేయాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. ధరణి పోర్టల్, నిర్మాణాల వివరాలపై వెబ్ ఎక్స్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, పంచాయతీ కార్యదర్శులతో కలెక్టర్ వెంకటరావు సమీక్షించారు. దసరా రోజున ధరణి పోర్టల్‌ను ప్రారంభిస్తారని తెలిపారు.
నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు
మున్సిపల్, మండల, గ్రామస్థాయి అధికారులు యుద్ధప్రాతిపదికన నిర్మాణాల సమాచార సేకరణ పనిని పూర్తి చేయాలని, ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎంపీడీవోలు, ఎంపీఓలపై నిర్మాణాల సమాచార సేకరణ బాధ్యత సమానంగా ఉంటుందని.. ఎలాంటి ఒత్తిడులకు గురికావొద్దని తెలిపారు. అన్ని ప్రైవేటు నిర్మాణాలతో పాటు, ప్రభుత్వ నిర్మాణాలు, చెత్తను వేరు చేసే షెడ్డులు, వైకుంఠ దామాలు, తాగు నీటి ట్యాంకుల వంటివి కూడా లెక్కించాలని... పాఠశాలలు, ఇతర ప్రభుత్వ, స్థానిక సంస్థల, నిర్మాణాలన్నింటిని లెక్కలోకి తీసుకోవాలని ఆదేశించారు.
విస్త్రుత ప్రచారం చేయాలి..
మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలలో నిర్మాణాల లెక్కింపు విషయమై విస్త్రుత ప్రచారం చేయాలని తెలిపారు. మున్సిపాలిటీలలో వెబినార్ ద్వారా అవగాహన సదస్సు ఏర్పాటుచేసి మున్సిపల్ ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్లు, వార్డ్ సభ్యులందరికి అవగాహన కల్పించాలన్నారు. అన్ని గ్రామ పంచాయితీలలో ఈనెల 28న అవగాహన సదస్సులు నిర్వహించాలని పేర్కొన్నారు. లెక్కింపు విషయంలో ఎవరైనా తప్పు చేస్తే సహించేది లేదని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు.
ఇదీ చూడండి: వినియోగం ప్రాతిపదికనే భూమి విలువ నిర్ణయం