GST on food products problams: మనం 25 కిలోల బియ్యం బస్తాలు చూశాం. ఇప్పుడు 26 కిలోల చొప్పున వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆహార పదార్థాలపై జీఎస్టీ విధించడమే ఇందుకు కారణం. ముద్ర (లేబుల్) కలిగిన 25 కిలోల బియ్యం బస్తాపై 5 శాతం జీఎస్టీ వసూలు చేస్తున్నారు. దాంతో సామాన్యుడిపై భారం పడుతోంది. వ్యాపారులు ఈ భారం నుంచి తప్పించడానికి 26 కిలోల నుంచి 30 కిలోల బస్తాలను మార్కెట్‌లోకి తీసుకొస్తున్నారు. వ్యాపారులు జీఎస్టీని అడ్డుపెట్టుకుని వీటిపైనా అదనంగా వసూలు చేస్తే ప్రభుత్వం, వినియోగదారులు నష్టపోతారు.
బియ్యం ధరలకు రెక్కలు:
జీఎస్టీ పరిస్థితి ఇలా ఉండగా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బియ్యం ధరలకు రెక్కలు వచ్చాయి. 15 రోజుల వ్యవధిలో క్వింటాలుపై రూ.400 నుంచి రూ.600 వరకు ధరలు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం వినియోగదారులు ఎక్కువగా ఆర్‌ఎన్‌ఆర్, జైశ్రీరాం రకం వాడుతున్నారు. వీటిలో స్టీమ్, సాధారణ బియ్యం అమ్మకాలు జరుగుతాయి. వ్యాపారులు పాత బియ్యం లెక్కన విక్రయిస్తుంటారు. ఇలా ధరలు పెరగడంతో సామాన్య ప్రజలు కొనుగోలు చేయడానికి అవస్థలు పడుతున్నారు.
ఇదీ పరిస్థితి:
* ఆర్‌ఎన్‌ఆర్ స్టీమ్ బియ్యం 25 కిలోల బస్తా 15 రోజుల కిందట రూ.1,100 ఉంటే ప్రస్తుతం రూ.1200 విక్రయిస్తున్నారు. ఇదే బియ్యం సాధారణం రూ.975 నుంచి రూ.1050 వరకు ఉండేది. ఇప్పుడు రూ.1,100 తీసుకుంటున్నారు. రూ.4,400 నుంచి రూ.4,800 చొప్పున క్వింటా విక్రయిస్తున్నారు.
* జైశ్రీరాం బియ్యం 25 కిలోల బస్తా 15 రోజుల కిందట రూ.1,350 ఉంటే ప్రస్తుతం రూ.1,500 పలుకుతోంది. ఈ బియ్యాన్ని క్వింటాలుకు రూ. 6 వేలు తీసుకుంటున్నారు. వరంగల్‌లో ఇదే రకం బియ్యం క్వింటాకు రూ.7,000 చొప్పున తీసుకుంటున్నట్లు సమాచారం.
ముద్ర ఉన్న 25 కిలోల బస్తాలపై జీఎస్టీ అమలు
- మహేశ్, అసిస్టెంట్ కమర్షియల్ అధికారి, మహబూబాబాద్
25 కిలోల బస్తాలపై జీఎస్టీ అమలు ఉంది. దానిని దృష్టిలో పెట్టుకున్న కొందరు వ్యాపారులు దాని భారం తప్పించడానికి, తప్పించుకోవడానికి 26 కిలోల బస్తాలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. వీటిపై కూడా వినియోగదారుల నుంచి జీఎస్టీ వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకుంటాం.
ఇవీ చదవండి: