ఉమ్మడి పాలమూరు జిల్లాలో కంటైన్మెంట్ జోన్లలో మినహా ఇతర ప్రాంతాల్లో లాక్డౌన్ ప్రభావం పెద్దగా కనిపించడం లేదు. నిత్యావసరాలు, అత్యవసరాలకు సాయంత్రం ఆరు గంటల వరకు సమయం ఇవ్వడం వల్ల రోడ్లపై జనం రద్దీ కనిపిస్తోంది. పండ్లు, కూరగాయలు, కిరాణా దుకాణాలకు జనం వచ్చి వెళ్తున్నారు. కొత్త కేసులు లేకపోవడం వల్ల అధికారులు వలస కార్మికులపై దృష్టి సారించారు.
మహబూబ్నగర్ జిల్లాలో 10 వేల మంది, నాగర్ కర్నూల్ జిల్లాలో 4,500, నారాయణపేట జిల్లాలో 5,400, వనపర్తి జిల్లాలో 2 వేలు, జోగులాంబ గద్వాల జిల్లాలో సుమారు 1000 మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులను గుర్తించారు. వీరిలో సుమారు 1000 మంది సొంత రాష్ట్రానికి వెళ్లేందుకు అధికారుల వద్ద దరఖాస్తులు చేసుకున్నారు.
సొంత వాహనాల్లో వెళ్లే వారికి రెవెన్యూ అధికారులు వైద్యులతో వైద్య పరీక్షలు నిర్వహించి అనుమతులు మంజూరు చేస్తున్నారు. సుదూర ప్రాంతాలకు వెళ్లే వారు పోలీసుల వద్దకు వెళ్లి అనుమతులు కోరుతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిని చెక్ పోస్టుల వద్ద ఆరోగ్య తనిఖీలు నిర్వహించి జిల్లాల్లోకి అనుమతిస్తున్నారు.
ఇదీ చూడండి: కేసుల సంఖ్య తగ్గించి చెబుతున్నారు: బండి సంజయ్