మహబూబ్ నగర్ జిల్లాలోని దేవరకద్ర, చిన్నచింతకుంట, కోయిలకొండ మండలాల్లో సోమవారం రాత్రి మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవడం వల్ల ఆయా మండలాల పరిధిలోని వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. కోయిల్ సాగర్ జలాశయము గేట్లు ఎత్తడం వల్ల వరద నీరు దేవరకద్ర నియోజకవర్గం మధ్య గుండా వెళ్తున్న పెద్దవాగు, బండర్‌పల్లి వాగు ఇతర అనుబంధ వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి.
కోయిల్ సాగర్ నుంచి అధికారులు మూడు గేట్లు పైకెత్తి.. మూడు వేల క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతాలకు వదులుతున్నారు. వరద నీటితో.. బండర్‌పల్లి, ముత్యాలపల్లి వాగులపై నిర్మించిన చెక్‌డ్యామ్‌లు జలకళ సంతరించుకున్నాయి.
చెక్‌డ్యామ్ నిండి వరద నీరు పైనుంచి ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద నీటితో పరవళ్లు తొక్కుతున్న వాగులు, చెక్‌డ్యామ్‌లను జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి పరిశీలించారు. నీటి ప్రవాహాల దగ్గర జనాలు జాగ్రత్తగా ఉండాలని, ప్రమాదకరమైన ప్రాంతాలను పోలీసులు నిత్యం పర్యవేక్షించాలని ఆయా మండలాల పోలీసులకు ఆమె సూచించారు. వంతెనలు దాటే సందర్భంలో అప్రమత్తంగా ఉండాలని.. ఇతర ప్రాంతాలకు ప్రయాణాలు పెట్టుకోకపోవడమే మంచిదని ఆమె ప్రజలను కోరారు.
ఇదీ చదవండిః చెట్టుపై ఉండగా గుండెపోటు.. గీత కార్మికుడు మృతి