ఉమ్మడి పాలమూరు జిల్లాలో కల్తీ కల్లు వ్యాపారం జోరుగా సాగుతున్నా ఎక్సైజ్ శాఖ నిద్రమత్తు వదలడం లేదు. ఏదైనా ఘటన జరిగినప్పుడు నమూనాల సేకరణ పేరుతో హడావుడి చేసి ఆ తర్వాత చేతులు దులిపేసుకుంటున్నారు. చనిపోయిన ఘటనల్లోనూ కల్లు వ్యాపారులపై చర్యలు ఉండటం లేదు. మహబూబ్‌నగర్ జిల్లా ఆసుపత్రిలో కల్తీకల్లు బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది.
ఏడో తేది మొదలుకొని ఇప్పటి వరకూ మొత్తం 12మంది ఇన్ పేషెంట్లుగా చేరారు. వీరిలో 8మంది మహిళలు, ఒక పురుషడు జనరల్ వార్డులో చికిత్స పొందుతుండగా, ముగ్గురు ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఎక్కువమంది మహిళలే బాధితులుగా ఉండటం గమనించాల్సిన అంశం. మరో 21మంది బయటి రోగులుగా వచ్చి చికిత్స పొంది ఇళ్లకు వెళ్లిపోయారు.
మహబూబ్‌నగర్ పట్టణానికి సమీపంలో వివిధ కల్లు దుకాణాల్లో వీరంతా కల్లు సేవించి అస్వస్థతకు గురయ్యారు. ఇంటికి వెళ్లిన తర్వాత పిచ్చిపిచ్చిగా ప్రవర్తించడం, వాంతులు కావడంతో కుటుంబ సభ్యులు జనరల్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. కొందరు కల్లులో మత్తుపదార్ధాల మోతాదు ఎక్కువ కావడంతో రెండుమూడు రోజులుగా కల్లు సేవించకుండా ఆపేశారు.
నిత్యం తాగాల్సిన కల్లు వారికి అందకపోవడంతో పిచ్చిపిచ్చిగా ప్రవర్తించడం, వాంతులు కావడం, ఆహారం తీసుకోకపోవడం లాంటి లక్షణాలతో ఆసుపత్రిలో చేరారు. కొద్దిరోజులుగా సేవిస్తున్న కల్లు తేడాగా ఉండటం వల్ల దాన్నిఆపేశామని, అందువల్లే అనారోగ్యానికి గురయ్యామని బాధితులు చెబుతున్నారు. కల్తీ కల్లు తయారీకి క్లోరో హైడ్రేట్, ఆల్ప్రజోలం వంటి మత్తు పదార్థాలు వాడుతుంటారు. మోతాదులో తేడా రావడంతోనే బాధితులు అనార్యోగం పాలైనట్లు సమాచారం.
ఎక్సైజ్ శాఖ అధికారులు బోయపల్లి, దొడ్లోనిపల్లి, కోయనగర్, తిమ్మసానిపల్లి తదితర ప్రాంతాల్లోని కల్లు కాంపౌండ్లలో నమూనాలను సేకరించారు. సీహెచ్, ఆల్పాజోలం వంటివి కలిపారా అనేది నిర్ధారించడానికి అక్కడే పరీక్ష చేశారు. ఇతర మత్తు పదార్థాలు ఏమైనా కలిపారా అనేది తేల్చేందుకు నమునాలను హైదరాబాద్ లోని ల్యాబ్‌కు పంపించారు.
అందుకు పూర్తిగా భిన్నంగా: ఉమ్మడి జిల్లాలో టీసీఎస్ లైసెన్సుదారులు 312 మంది, టీఎఫ్టీ లైసెన్సు ఉన్న కల్లుగీత కార్మికులు 772 మంది ఉన్నారు. వారు మాత్రమే కల్లు విక్రయించొచ్చు. క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం అందుకు పూర్తిగా భిన్నంగా ఉంది. అనుమతుల కంటే పది రెట్లు అధికంగా కల్లు దుకాణాలు నడుస్తున్నాయి. క్లోరో హైడ్రేట్ ,ఆల్ప్రజోలం తదితరాలతో తయారు చేసిన కల్లు కావటంతో ఎక్కువ మత్తు వస్తోంది. దీనికి అలవాటైన వారు బానిసలుగా మారుతున్నారు. కల్తీ కల్లు తయారీకి వినియోగించే ఈ పదార్థాలు మెదడుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి.
మహబూబ్‌నగర్ జిల్లాలో క్లోరో హైడ్రేట్ దందాను ఇద్దరు నడిపిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. వనపర్తి, నాగర్ కర్నూల్, నారాయణపేట జిల్లాలకు కూడా ఇక్కడ నుంచే సీహెచ్ సరఫరా అవుతున్నట్లు సమాచారం. కిలో ఆల్ప్రజోలం రూ.4 లక్షల వరకు ధర పలుకుతోంది. ఉమ్మడి జిల్లాలో నెలకు రూ.10 కోట్లకు పైగా వ్యాపారం జరుగుతోంది. నాగర్ కర్నూల్ జిల్లాలో అచ్చంపేట ప్రాంతంలో కల్తీ కల్లుతో చనిపోయిన ఘటనలు చాలానే జరిగినా బాధిత కుటుంబాలతో వ్యాపారులు ఒప్పందం చేసుకుని కేసులు కాకుండా జాగ్రత్త పడుతున్నారు.
ఇవీ చదవండి: రైతులకు శుభవార్త.. రేపటి నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
TMC, CPI, NCPకి ఈసీ షాక్.. జాతీయ పార్టీ హోదా రద్దు.. 'ఆమ్ ఆద్మీ'కి ప్రమోషన్!