Judcharla Parks are Neglected by the Local Body: పారిశ్రామికంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న జడ్చర్ల పట్టణంలో జనాభా పెరుగుతోంది. వారికి ఆహ్లాదం మాత్రం కరవైంది. కాలనీల్లోని చిన్నారులు ఆడుకునేలా, వృద్ధులు కూర్చొని సేదతీరేలా, మహిళలు, యువకులు వాకింగ్, వ్యాయామం చేసేలా అన్ని ఏర్పాట్లతో పార్కులు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. జడ్చర్ల పురపాలికలో ప్రభుత్వ ఆశయం నీరుగారింది.
మొత్తం 13 చోట్ల కొత్తగా పార్కులు నిర్మించాలని నిర్ణయించినా ప్రస్తుతం 8 మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. అధికారులు పార్కులుగా చెబుతున్న వనాల్లోనూ సరైన వసతులు లేక వెలవెల బోతున్నాయి. జడ్చర్ల నల్లచెరువుపై మీనిట్యాంక్ బండ్‌ను నిర్మించారు. ఆహ్లాదాన్ని పంచాల్సిన మీనిట్యాంక్ బండ్ పట్టణవాసులను సేదతీర్చడం లేదు. కట్ట నడిచేందుకు అనువుగా లేక గుంతలమయమైంది. గడ్డి ఇష్టానుసారం పెరిగిపోతుంది. విద్యుత్ దీపాలు లేవు.
దీంతో సాయంత్రమైతే చాలు.. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతోంది. ఎక్కడపడితే అక్కడ మద్యం సీసాలు దర్శనమిస్తున్నాయి. హౌసింగ్ బోర్డు కాలనీలో అప్పటి పంచాయతీ ఆధ్వర్యంలో 18లక్షలతో పార్కు నిర్మాణం పూర్తిచేశారు. అనంతరం పురపాలికలో విలీనమైంది. మొక్కలకు నీళ్లు పట్టేందుకు సరైన వసతి లేక కొన్నిచోట్లు గడ్డి, మొక్కలు ఎండిపోతున్నాయి. సరస్వతీ నగర్లో పచ్చదనం, మైదానం, ఆటవస్తువులు ఏమీ లేవు.
కాలనీవాసులే కొంత డబ్బు సమకూర్చుకుని కొన్ని వసతులు కల్పించున్నారు. గణేశ్ మండపాన్ని, సిమెంట్ బల్లల్ని ఏర్పాటు చేసుకున్నారు. సత్యనారాయణ స్వామి కాలనీ, బీసీ వసతి గృహం ఆనుకుని ఉన్న పార్కులోనూ అదే పరిస్థితి. శ్రీనివాస థియేటర్ ప్రాంతంలోని పార్కు నిండా గడ్డి దర్శనమిస్తుంది. గడ్డి పెరిగి పార్కులోకి పాములు వస్తున్నాయని స్థానికులెవరూ అక్కడకు రావడం లేదు. బండమీది కృష్ణారెడ్డి కాలనీలోని పార్కులో నీటి సౌకర్యం లేదు.
పందులు స్వైర విహారం చేస్తున్నాయి. గతంలో గ్రామపంచాయితీలుగా ఉన్నప్పుడు 10శాతం కింద కేటాయించిన స్థలాల్ని పార్కులుగా అభివృద్ధి చేయాల్సి ఉన్నా అ దిశగా అడుగు ముందుకు పడటం లేదు. స్థలాలు మావంటే మావని కొందరు కోర్టులను ఆశ్రయించడంతో 10శాతం స్థలాలు అభివృద్ధికి నోచుకోవడం లేదు. గతంలో గ్రామపంచాయతీకి కేటాయించిన 10శాతం స్థలాలు కబ్జాకు గురవుతున్నాయి.
వాటిని కాపాడాల్సిన ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోకపోవడంతో.. స్థానికులే వాటిని కాపాడుకుంటున్నారు. విజయవనగర్ కాలనీ, కావేరమ్మపేట సమీపంలోని 10శాతం స్థలాల్లో ప్రస్తుతం అలాంటి వివాదాలే నెలకొన్నాయి. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. పార్కుల అభివృద్ధిపై జడ్చర్ల మున్సిపాలిటీ కమిషనర్ మహమూద్ షేక్ వివరణ కోరగా ప్రస్తుతం 8 చోట్ల పార్కులు ఏర్పాటు చేశామని, మరో ఐదు చోట్ల అభివృద్ది చేసేందుకు ప్రతిపాదనలు పంపినట్లుగా చెప్పారు. ఉన్న పార్కులపై పర్యవేక్షణ పెంచి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పార్కుల అభివృద్ధిపై దృష్టి సారించాలని జడ్చర్ల పట్టణ వాసులు కోరుతున్నారు.
ఇప్పుడు జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో ఎనిమిది పార్కులు డెవలప్ చేయడం జరిగింది. మిగతావి కూడా కాలనీ వాసులు అడుగుతున్నారు. పార్కులు డెవలప్ చెయమని, వాటిని కూడా ఎస్టిమేషన్ ప్రీపేర్ చేసి గవర్నమెంట్‌కి ప్రతిపాదనలు పంపి ఆమోదం పొందిన తరువాత మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది. -మహమూద్ షేక్, జడ్చర్ల మున్సిపాలిటీ కమిషనర్
ఇక్కడ పార్కు ఐతే కేటాయించారు. కానీ పార్కు డెవలప్మెంట్ సరిగ్గా లేదు. సరైనా నీటి వసతి లేక ఉన్న గడ్డి కూడా ఎండిపోతుంది. పార్కు చుట్టూ డ్రైనేజీ వ్యవస్థ ఉంది. మున్సిపాలిటీ సిబ్బంది ఈ పార్కును మంచిగా డెవలప్‌చేసి, ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలాగా చేయ్యాలి. పార్కులో వాకింగ్ సరిగ్గా లేదు. దానిని బాగు చేయ్యాలి. నీటి వసతి లేక గడ్డి ఎండిపోతుంది. మున్సిపాలిటీ సిబ్బంది చర్య తీసుకొని, నీటి వసతి ఉండి, ఆహ్లాదకరంగా చేయ్యాలని కోరుతున్నాం. -స్థానికులు
ఇవీ చదవండి: