మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల, నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట, రంగారెడ్డి జిల్లా కొత్తూరు మున్సిపాలిటీ పాలక వర్గాల ప్రమాణ స్వీకారం సహా ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ల ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. బాదేపల్లి మున్సిపల్ కార్యాలయంలో జడ్చర్ల మున్సిపాలిటీకి కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం జరిగింది. జడ్చర్ల శాసనసభ్యుడు లక్ష్మారెడ్డితో కలిసి 23 మంది తెరాస కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. ప్రమాణ అనంతరం ఛైర్మన్, వైస్ ఛైర్మన్లను ఎన్నుకున్నారు. జడ్చర్ల మున్సిపాలిటీలో మొత్తం 27 వార్డులుండగా 23 వార్డుల్లో తెరాస అభ్యర్థులు కౌన్సిలర్లుగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్-2, భాజపా-2 వార్డులను గెలుచుకున్నాయి.
జడ్చర్ల ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పీఠాలు తెరాసకు దక్కాయి. ఛైర్మన్ పదవి బీసీ మహిళకు కేటాయించారు. 8వ వార్డు నుంచి కౌన్సిలర్‌గా గెలిచిన దోరెపల్లి లక్ష్మిని ఛైర్‌పర్సన్‌గా... 15వ వార్డు నుంచి గెలిచిన సారికను వైస్ ఛైర్‌పర్సన్‌గా ఎన్నుకున్నారు. ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవులకు ఒకే నామినేషన్ రావడం వల్ల ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి తేజస్ నంద్లాల్ పవార్ ప్రకటించారు. అనంతరం ఛైర్మన్, వైస్ ఛైర్మన్లు ప్రమాణ స్వీకారం చేశారు. జడ్చర్ల పట్టణ సమగ్రాభివృద్ధే లక్ష్యంగా నూతన పాలక వర్గం పనిచేస్తుందని మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. నూతన పాలక వర్గానికి, ఛైర్ పర్సన్, వైస్ ఛైర్పర్సన్లకు శుభాకాంక్షలు తెలిపారు.
అచ్చంపేట ఛైర్మన్‌గా ఎడ్ల నర్సింహ గౌడ్
అచ్చంపేట పురపాలిక పాలకవర్గం ప్రమాణ స్వీకారం బాలికల ఉన్నత పాఠశాలలో జరిగింది. అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సహా తెరాస నుంచి గెలిచిన కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. తొలత కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేశారు. కొవిడ్ వల్ల హాజరుకాని మూడు, ఆరు, 18, 13 వార్డు కొన్సిలర్లు ప్రమాణ స్వీకారానికి హాజరుకాలేదు. వారిచేత డిజిటల్ విధానం ద్వారా ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఛైర్మన్, వైస్ఛైర్మన్ల ఎన్నిక జరిగింది.
అచ్చంపేట మున్సిపాలిటీలో 20 వార్డులుండగా తెరాస 13, కాంగ్రెస్-6 భాజపా-1 స్థానాన్ని గెలుచుకున్నారు. ఛైర్మన్ పదవి తెరాసకు దక్కింది. ఛైర్మన్ పదవి జనరల్‌కు రిజర్వ్ కాగా 16వార్డు నుంచి గెలిచిన ఎడ్ల నర్సింహ గౌడ్ ఛైర్మన్‌గా, 19వ వార్డు నుంచి గెలుపొందిన శైలజారెడ్డిని వైస్ ఛైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికున్నారు. ప్రమాణ స్వీకారానికి ముందే కౌన్సిలర్లతో సమావేశమైన మంత్రి నిరంజన్ రెడ్డి అధిష్ఠానం సూచన మేరకే వీరిద్దరినీ ఎంపిక చేశామని వెల్లడించారు. కొత్తగా ఎన్నికైన ఛైర్మన్, వైస్ ఛైర్ పర్సన్లకు గువ్వల బాలరాజు శుభాకాంక్షలు తెలిపారు. అచ్చంపేటలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా పనిచేస్తామన్నారు.
కొవిడ్ నిబంధనలకు లోబడి సభ్యులందరి చేత ఒకేసారి ప్రమాణ స్వీకారం చేయించారు. కొవిడ్ నెగటివ్ ఉన్న వారిని మాత్రమే ప్రమాణ స్వీకారానికి అనుమతించారు.
ఇదీ చూడండి: సిద్దిపేట మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా కడవేర్గు మంజుల