కరోనా ప్రభావంతో మార్చి 22న నిలిచిపోయిన అంతర్రాష్ట్ర ఆర్టీసీ సర్వీసులు ఎట్టకేలకు తిరిగి ప్రారంభమయ్యాయి. అన్‌లాక్ నిబంధనల్లో భాగంగా మే 19 నుంచి ఆర్టీసీ సర్వీసులు ప్రారంభించినా ఇరు రాష్ట్రాల మధ్య సర్వీసుల విషయంలో సఖ్యత కుదరకపోవడం వల్ల బస్సులు సరిహద్దు దాటలేదు. సోమవారం ఎట్టకేలకు ఇరు రాష్ట్రాల మధ్య చర్చలు ఫలించడం వల్ల మంగళవారం నుంచి షెడ్యూలు ప్రకారం బస్సులు నడపాలని అధికారులు ఆయా డిపోలకు ఆదేశాలు జారీ చేశారు.
కొంతకాలంగా అంతర్రాష్ట్ర సర్వీసులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ప్రధానంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ రీజియన్ నుంచి ఏపీలోని కర్నూలు, కడప, అనంతపురం, తిరుపతికి పెద్ద సంఖ్యలో రాకపోకలు సాగిస్తుంటారు. అత్యధికంగా జోగులాంబ గద్వాల, వనపర్తి, మహబూబ్‌నగర్ డిపోల నుంచి కర్నూలు జిల్లా కేంద్రానికి సర్వీసులు ఉండేవి. అంతర్రాష్ట్ర సర్వీసులు నిలిపేయడం వల్ల ఇంతవరకు అలంపూర్ చౌరస్తా వరకు మాత్రమే బస్సులు నడిపారు. అక్కడి నుంచి ప్రైవేటు వాహనాల్లో వెళ్లాల్సి వచ్చేది.
అధికారులు ఆదేశాలపై మంగళవారం నుంచి షెడ్యుల్ ప్రకారం బస్సులను ప్రారంభించగా... మహబూబ్‌నగర్ డిపో నుంచి తిరుపతి, శ్రీశైలం, రాజమండ్రి, గుంటూరు, కర్నూలు ప్రాంతాలకు బస్సులను ప్రారంభించారు. మహబూబ్‌నగర్ రిజియన్ పరిధిలోని ఉమ్మడి జిల్లాలో 9 డిపోలు ఉండగా.. నిత్యం 90 బస్సుల వరకు పాత రూట్లలోనే నడపనున్నారు.
ఇదీ చూడండి: సంగారెడ్డి నుంచి విజయవాడకు ఆర్టీసీ బస్సు... ప్రారంభించిన డీఎం