Pests of chilli crop: ఈ ఏడాది మిరప రైతులకు కలిసి రాలేదు. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో తెగుళ్లదాడి ఎక్కువైంది. వానలు, చల్లని వాతావరణం వల్ల మిరపపై తెగుళ్లు విస్తృతంగా దాడి చేశాయి. చాలాచోట్ల తల్లివేరు చనిపోయి పిల్లవేళ్లు రంగుమారి కనిపిస్తున్నాయి. మొక్క ఎండిపోయినట్లుగా మారుతోంది. దీనికి తోడు ఆకుపై మచ్చల్లాంటివి ఏర్పడి ముడుచుకుపోతున్నాయి. కొన్ని ఎండి రాలిపోతున్నాయి. కాత రైతుల చేతికందే పరిస్థితి లేదు. తొలుత కాయలపై చిన్నమచ్చ ఏర్పడి, తర్వాత నల్లగా మారి, మెల్లిగా పంటంతా వ్యాపిస్తోంది. పచ్చిమిరపైనా, పండు మిరపైనా కాయంతా కుళ్లిపోతోంది.
తడిసి మోపడవుతున్న ఖర్చులు...
పంట పండించేందుకు పెట్టిన పెట్టుబడులు ఒక ఎత్తైతే తెగుళ్ల నుంచి మిరపను రక్షించుకునేందుకు చల్లే పురుగుమందులకయ్యే ఖర్చు తడిసి మోపడవుతోంది. తెగుళ్ల బారిన పంటకు ఎన్నిరకాల మందులు చల్లినా అదుపులోకి రావడం లేదని రైతులు వాపోతున్నారు. ఇప్పటికే వేలు ఖర్చుచేసి అన్నిరకాలుగా ప్రయత్నాలు చేసి పంట చేతికి రాదని నిర్ధారించుకున్న రైతులు.. మిరపను తీసేసి ఆరుతడి పంటల వైపు మళ్లుతున్నారు. నాగర్ కర్నూల్, గద్వాల, వనపర్తి జిల్లాలోని మిరప రైతులు ఈ తరహా పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.
ఆదుకోవాలంటున్న రైతులు...
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో సుమారు 50వేల ఎకరాల్లో సాగు చేస్తున్న మిరపకు పూతల పురుగు, కాయకుళ్లు తెగులు, కాయమచ్చ తెగుళ్లు వచ్చినట్లుగా ఉద్యానశాఖ అధికారులు, శాస్త్రవేత్తలు గుర్తించారు. తెగుళ్ల నివారణకు సూచనలు చేస్తున్నారు. కానీ తెగుళ్ల ఉద్ధృతి తగ్గడం లేదని రైతులు వాపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పాడైన పంటకు పరిహారం చెల్లించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
నేను రెండెకరాల మిర్చి పంట వేసిన. మొత్తం తెగులు తాకింది. ఎన్ని మందులు కొట్టినా తెగులు పోవడం లేదు. ఏమైనా కాయ ఉన్నా పురుగు తింటుంది. పూత ఆగడంలేదు. ఇప్పటికే దగ్గర దగ్గర 50వేల రూపాయలదాకా పెట్టుబడి పెట్టాం- మిర్చి రైతు
నేను మూడెకరాలు కౌలు తీసుకొని మిరపతోట వేసిన. పంట మొత్తం కాయకుళ్లు తెగులు వచ్చింది. పండు కాయతో సహా పచ్చికాయ సైతం మాడిపోతుంది. చెట్టుకున్న పూత రాలుతుంది. అనేక మందులు కొట్టిన తగ్గటంలేదు. కాయ వచ్చేసి మొత్తం తెల్లగా మారుతుంది. ఇప్పటివరకు రూ. 1.5 లక్షలు పెట్టుబడి పెట్టిన. పంట వెళ్లేలా లేదు. ఏం చేయాలో అర్థం కావడం లేదు.- కౌలు రైతు
ఇదీ చదవండి: cotton farmers problems: పత్తి రైతుకు దుఃఖం... ధర బావున్నా పడిపోయిన దిగుబడి
Irregularities in land registration:తమది కాని భూమిని... ఎంచక్కా అమ్మేస్తున్నారు!