ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో అక్రమ ఇసుక రవాణా యథేచ్ఛగా సాగుతోంది. ప్రమాదాలను పట్టించుకోకుండా ఇసుక బకాసురులు ఇష్టారాజ్యంగా ఇసుకను తరలిస్తున్నారు. ఇటీవలే రాజాపూర్ మండలం తిర్మలాపూర్‌లో ఇసుక లారీ ఢీ కొట్టడం వల్ల ఓ రైతు మృత్యువాతపడ్డారు. మూసాపేట మండల కేంద్రానికి చెందిన ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఇసుక వాహనం ఢీ కొట్టిన కారణంగానే ప్రాణాలు కోల్పోయినట్లు విచారణలో వెల్లడైంది. ఇలా ఉమ్మడి జిల్లాలో ఇసుక మాఫియా ఆగడాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అయినా అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదు. వివిధ అనుమతుల పేరుతో జిల్లా వ్యాప్తంగా ఇసుకను అక్రమంగా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు.
రైతు వేదికల పేరుతో..
నారాయణపేటలోనూ ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. జిల్లాలోని 77 రైతు వేదికల నిర్మాణం కోసం ఏడు వాగుల్లోంచి 4,540 క్యూబిక్ మీటర్ల ఇసుకను ఉచితంగా తరలించేందుకు జిల్లా రెవెన్యూ అధికారులు ఆదేశాలిచ్చారు. కేటాయించిన ఇసుక కంటే అధికంగా తవ్వి హైదరాబాద్, మహబూబ్‌నగర్, పరిగి లాంటి పట్టణాలకు తరలిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. సుమారు 40 వేలకు టిప్పర్ చొప్పున వందల సంఖ్యలో టిప్పర్లు ఉట్కూరు, నారాయణపేట, పరిగి మీదుగా హైదరాబాద్ వెళ్తున్నట్లు సమాచారం. నాగిరెడ్డిపల్లి వాగు నుంచి సైతం ఇసుక అక్రమ రవాణాకు రంగం సిద్ధం చేశారనే ఆరోపణలు వస్తున్నాయి.
మొత్తంగా జిల్లాలో ఎక్కడ ఇసుక కనిపించినా మాఫియా అక్కడ వాలిపోయి అడ్డగోలుగా తవ్వకాలు జరుపుతోంది. దీనివల్ల వాగులు ఎండిపోవడమే కాకుండా, భూగర్భజలాలు తగ్గిపోయి పంటలసాగుపై ప్రభావం చూపుతుందని రైతులు వాపోతున్నారు. ఇకనైనా రాజకీయ నాయకులు ఇసుక అక్రమ రవాణాదారులకు మద్దతివ్వకుండా, ఇసుక తవ్వకాలు నిరోధించేందుకు దోహదపడాలని, అధికార యంత్రాంగం అక్రమ తవ్వకాలపై ఉక్కుపాదం మోపాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి: అక్రమంగా తరలిద్దామనుకున్నారు.. ఇరుక్కుపోయారు