Illegal Constructions In SC Corporation lands : మహబూబ్‌నగర్‌లోని ఎస్సీ కార్పొరేషన్‌కు చెందిన ప్రభుత్వ స్థలం అన్యాక్రాంతం కావడంపై ప్రస్తుతం రగడ నడుస్తోంది. లక్ష్మీనగర్ కాలనీలో ఎస్సీ కార్పొరేషన్ సుమారు 40 ఏళ్ల కిందట 5.30 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించారు. సర్వే నంబరు 250లో 2.02 ఎకరాలు, సర్వే నంబరు 247లో 3.28 ఎకరాల్లో ఆ భూమి ఉంది.
Illegal Constructions In SC lands in Mahabubnagar : కొంత స్థలంలో కార్పొరేషన్ చెందిన విద్యార్థి వసతి గృహాలు, ఉపాధి కల్పన కోసం కోళ్లఫారాలు నిర్మించారు. మరికొంత స్థలాన్ని కోఆపరేటివ్ సొసైటీ భవన నిర్మాణం కోసం ఇచ్చారు. మిగిలిన భూమిని ఖాళీగా వదిలేశారు. ఆ తర్వాత ఆ భూముల్ని పట్టించుకోవడం మానేశారు. ఇదే కొందరిపాలిట వరంగా మారింది. కార్పొరేషన్ స్థలాలు అక్రమించి ఇళ్లు నిర్మించుకున్నారు. ఆ స్థలంలో 53 పైగా ఆక్రమణలు వెలిశాయి.
అధికారం లేకున్నాపట్టాలు జారీ : ఎస్సీ కార్పొరేషన్‌కు చెందిన భూముల్లో కొందరికి రెవెన్యూ శాఖ పట్టాలిచ్చింది. వాస్తవానికి రెవెన్యూ శాఖకు ఇక్కడ పట్టాలు ఇచ్చే అధికారం లేదు. ఆ పట్టాలు చూపించి ఇంటి అనుమతులు, నల్లా కనెక్షన్లు, విద్యుత్తు కనెక్షన్లు పొందారు. పట్టాలు లేకుండానే కొందరు ఆక్రమణలు చేసుకున్నారు. ప్రభుత్వ స్థలాల్లో ఇంటి నిర్మాణాలు చేసుకుంటే.. పురపాలిక, విద్యుత్తు శాఖలు అనుమతులు ఇవ్వకూడదు. ఇక్కడి ప్రభుత్వ స్థలాల్లోని అక్రమ నిర్మాణాలకు మహబూబ్‌నగర్ పురపాలిక అధికారులు అనుమతులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.
అక్రమ భూములను అమ్ముకున్నారు : పుర అధికారులతో పాటు రిజిస్ట్రేషన్, విద్యుత్తుశాఖలు సైతం ఈ అనుమతుల విషయంలో ఎలాంటి పరిశీలనలు చేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది. కొందరైతే ఆక్రమణ చేసుకొని ఇతరులకు అమ్ముకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. తాజాగా కొందరు ఎస్సీ కార్పొరేషన్ భూముల్ని పరిరక్షించాలంటూ ప్రజావాణిలో జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో ఆక్రమణల పర్వం మరోసారి వెలుగులోకి వచ్చింది.
అక్రమాలకు సంబంధించి కలెక్టర్‌కు నివేదిక: ఆర్డీవో అనిల్ కుమార్, ఎస్సీ అభివృద్ధి శాఖ డీడీ పాండు, అర్బన్ సర్వేయర్ రాఘవేందర్, అర్బన్ ఆర్.ఐ నర్సింగ్‌లు కార్పొరేషన్‌కు సంబంధించిన స్థలాలను.. పరిశీలించారు. కార్పొరేషన్ స్థలానికి సంబంధించిన భూమికి హద్దులు గుర్తించారు. కొత్తగా నిర్మాణాలు సాగుతుండగా వాటిని నిలిపి వేశారు. దీనిపై కలెక్టర్‌కు నివేదిక సమర్పించనున్నట్లు అధికారులు తెలిపారు.
ఇవీ చదవండి: