Horse riding training center: గుర్రపు స్వారీ.. సినిమాల్లోనో, రేసుల్లోనో చూడటమే తప్ప నేర్చుకొని.. స్వారీ చేసే అవకాశాలు మాత్రం చాలా తక్కువ. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి మెట్రో పాలిటన్ నగరాల్లో తప్ప సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండవు. కానీ ప్రస్తుతం మహబూబ్‌నగర్, జడ్చర్ల వంటి నగరాల్లోనూ గుర్రపు స్వారీ శిక్షణ కేంద్రాలు వెలిశాయి. ఆరేళ్ల చిన్నారులు మొదలు.. చిన్నప్పటి నుంచి గుర్రపు స్వారీ కలలుగన్న 50 ఏళ్ల పెద్దల వరకు ఆసక్తిగా శిక్షణ కేంద్రాలకు వెళ్తున్నారు. స్థానికంగా శిక్షణా కేంద్రం ఏర్పాటు కావడంపై పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఆలోచనకు అనుగుణంగా కోర్సులు..
గుర్రమెక్కి దాన్ని దౌడు తీయించాలనుకునే వారికి.. వారి ఆలోచనకు అనుగుణంగా కోర్సులున్నాయి. నామమాత్రపు రుసుము చెల్లించి గెస్ట్ రైడ్ చెయ్యొచ్చు. బేసిక్స్ తెలిస్తే చాలనుకునే వారికి వారం కోర్సు, కాస్త పట్టు సాధించాలనుకునే వారికి.. నెల, 3 నెలల కోర్సులు అక్కడ అందుబాటులో ఉన్నాయి. ఆ రంగంలో రాణించాలనుకునే వారికి 6 నెలల సర్టిఫికేట్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వ్యాయామం, ఉల్లాసంతో పాటు ఈ రంగంలో ఎదగాలనుకునేవారూ ఉత్సాహంగా శిక్షణ పొందుతున్నారు. దేశీ, విదేశీ జాతి గుర్రాలపై అనుభవజ్ఞులు శిక్షణ ఇస్తుండటంతో.. అనేక మంది ఆసక్తి కనబరుస్తున్నారు.
గుర్రం చెప్పినట్లు వింటోంది..
ఉదయం 6 నుంచి 9 వరకు.. సాయంత్రం 4 నుంచి 6 వరకు ఒక్కొక్కరికి నిత్యం 45 నిమిషాల పాటు శిక్షణ ఇస్తున్నారు. హైదరాబాద్‌తో పోల్చితే మహబూబ్‌నగర్‌లో రుసుములు కాస్త చౌకగానే ఉన్నాయని శిక్షణార్థులు చెబుతున్నారు. అనేక మంది తమ చిన్నారులకు గుర్రపు స్వారీ నేర్పుతున్నారు. గుర్రం తాము చెప్పినట్టు వింటోందంటూ పిల్లలు సరాదాగా గడుపుతున్నారు.
మెండుగానే ఉపాధి అవకాశాలు..
ఆరు నెలల శిక్షణ పూర్తిచేసి సర్టిఫికేట్ పొందితే.. ఉపాధి అవకాశాలు సైతం మెండుగా ఉన్నాయని నిర్వాహకులు చెబుతున్నారు. రేసుల్లో పాల్గొనే వారికి తమవంతు సాయం అందిస్తామని చెబుతున్నారు. గుర్రపు స్వారీ కోర్సులో చేరిన వారికి ఉచితంగా స్విమ్మింగ్ అవకాశం కల్పిస్తున్నారు. మహబూబ్‌నగర్ వాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరుతున్నారు.
ఇదీ చూడండి: వనం వీడి జనం మధ్యకు సమక్క తల్లి.. జయజయధ్వానాలతో స్వాగతం..