అత్యధికంగా నాగర్‌కర్నూల్ జిల్లా తెలకపల్లిలో 226.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఉమ్మడి జిల్లాలో 20 మండలాల పరిధిలో అసాధారణ వర్షపాతం నమోదైంది. వనపర్తిలో జిల్లా కలెక్టరు యాస్మిన్ బాషా, ఎస్పీ అపూర్వారావు, నారాయణపేటలో జిల్లా కలెక్టరు హరిచందన జలమయమైన ప్రాంతాలను సందర్శించారు. ఉమ్మడి జిల్లాలో అధికారులకు సెలవులను రద్దు చేసి విధులకు హాజరు కావాలని ఆ జిల్లాల కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. వనపర్తి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూలు జిల్లా కేంద్రాల్లో పలు కాలనీలు జలమయమయ్యాయి.
![](https://assets.eenadu.net/article_img/16MB4-H1.jpg)
ప్రధాన ప్రాజెక్టుల పరిస్థితి ఇదీ..
- వనపర్తి జిల్లాలో రామన్‌పాడు జలాశయం అయిదు గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదిలారు. దీంతో ఊకచెట్టు వాగు ఉద్ధృతంగా ప్రవహించింది.
- నారాయణపేట జిల్లా సంగంబండ రిజర్వాయర్‌కు 20వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండడంతో చరిత్రలో తొలిసారి 8 గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదిలారు. దీంతో మాగనూరు వద్ద వరద నీరు రోడ్డుపైకి వచ్చి ప్రవహించి హైదరాబాద్ - రాయచూర్ రహదారిపై రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
- నది పరీవాహక ప్రాంతాల నుంచి వరదరాక పెరగడంతో జూరాలకు బుధవారం 1.60 లక్షల ఇన్‌ప్లో కొనసాగింది. దీంతో 17 గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదిలారు.
- కోయిలసాగర్ ప్రాజెక్టుకు నీటి మట్టం గరిష్ఠ స్థాయి చేరడంతో రెండు గేట్లు ఎత్తి 1,600 క్యూసెక్కుల నీటిని దిగువకు విడిచిపెట్టారు.
- సరళాసాగర్ ప్రాజెక్టు సైఫన్లు తెరచుకోవడంతో దిగువకు ప్రవాహం కొనసాగుతోంది. సాయంత్రానికి 2 ప్రైమింగ్, 5 హుడ్ సైఫన్లు తెరచుకుని 10 వేల క్యూసెక్కులు దిగువకు వెళ్తున్నట్లు అధికారులు చెప్పారు.
![](https://assets.eenadu.net/article_img/3333_65.jpg)
నష్టపోయిన పంటలు :
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 19.24 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారు. ఇందులో 9,986 ఎకరాల్లో పంట నీట మునగగా, వేలాది ఎకరాల్లో నీరు నిలిచింది. అత్యధికంగా పానగల్ మండలంలో 1,175 ఎకరాల్లో వరి పంట దెబ్బతింది. రెవెల్లిలో 865 ఎకరాలు, వీపనగండ్లలో 740 ఎకరాలు, దామరగిద్దలో 500 ఎకరాలు, కొల్లాపూర్ వెయ్యి ఎకరాల్లో వరి పంట నీటిలో తడిసింది.
![](https://assets.eenadu.net/article_img/16MB6-H_2.jpg)
కూలుతున్న గూడు :
ఉమ్మడి జిల్లాలో శిథిలావస్థకు చేరిన ఇళ్ల సంఖ్య పెరుగుతోంది. గత నెలలో పడిన భారీ వర్షాలకు ఉమ్మడి జిల్లాలో మొత్తం 1,477 శిథిలావస్థకు చేరిన ఇళ్లను గుర్తించారు. తరవాత వర్షాలు ఆగిపోవడంతో పట్టించుకోలేదు. రెండు రోజుల నుంచి వర్షాలు పడుతుండటంతో శిథిలావస్థకు చేరిన పలు ఇళ్లు కూలిపోయాయి. దీంతో అధికారులు జిల్లాల్లో మరోసారి శిథిలావస్థకు చేరిన భవనాలను గుర్తించే పనిలో పడ్డారు. బుధవారం ఒక్కరోజు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మరో 120 శిథిలావస్థకు చేరిన భవనాలను గుర్తించారు.
రైతులూ జాగ్రత్త :
మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. పంటలకు రైతులు కాంప్లెక్సు ఎరువులు వాడకూడదు. ఎలాంటి పురుగు మందులు పిచికారీ చేయొద్ధు పంటలో నీరు నిల్వకుండా చూసుకోవాలి. మల్టీ-కే (13-0-45)ను లీటర్ నీటిలో పది గ్రాములు వేసి పిచికారీ చేయాలి. కాపర్ ఆక్సిక్లోరైడ్‌ను లీటర్ నీటిలో 3 గ్రాములు వేసి పంట మొదళ్లు తడిసిలా పిచికారీ చేయాలి. వరిలో సుడిదోమ వ్యాపించే అవకాశం ఉంటుంది. యూరియాను అధిక మోతాదులో వాడొద్ధు
- రాజశేఖర్, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త, పాలెం
![](https://assets.eenadu.net/article_img/222_190.jpg)