దీపావళి పండుగను పురస్కరించుకొని రాష్ట్ర ప్రజలకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ దీపావళి ప్రజలలో సుఖ సంతోషాలను నింపాలని ఆయన ఆకాంక్షించారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పండుగను జరుపుకోవాలని కోరారు. ఈ మేరకు మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ యార్డులో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రి ప్రారంభించారు. రైతులు తాము పండించిన పంటలు అమ్ముకునేందుకు ఇబ్బందులు పడకూడదని అధిక సంఖ్యలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 192 కేంద్రాలు అందుబాటులో ఉన్నట్లు వెల్లడించారు.
మార్కెటింగ్ వ్యవస్థ
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో రైతుల కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టినట్లు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. భవిష్యత్తులో అన్నదాతల కోసం మార్కెటింగ్ వ్యవస్థను సైతం ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు.
త్వరలో మార్కెట్ యార్డులో కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటుకు ప్రయత్నం చేస్తున్నామని మంత్రి అన్నారు. దీని వల్ల రైతులు తాము పండించిన కూరగాయలు, పండ్లు దెబ్బతినకుండా ఉంచుకునేందుకు వీలుంటుందని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: సన్నధాన్యానికి టోకెన్ల కోసం అన్నదాతల పడిగాపులు..