కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. స్వాతంత్య్ర వేడుకలను పురస్కరించుకుని ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమం ప్రారంభించింది. అధికారులు అన్నిరంగాలకు చెందిన పలు ఆవిష్కరణలతో ప్రదర్శన ఏర్పాటు చేశారు. నిజామాబాద్ జిల్లాలో ఇంటింటా ఇన్నోవేటర్ కింద 15 ఆవిష్కరణలు నమోదు కాగా.. వీటిలో 8 ఆవిష్కరణలు ప్రదర్శనకు ఎంపికయ్యాయి. స్వతంత్ర వేడుకల సందర్భంగా నగరంలోని పరేడ్ మైదానంలో వాటిని ప్రదర్శించారు. ప్లాస్టిక్‌తో ఇటుకల తయారీ, గూగుల్ అసిస్టెంట్ హోమ్ ఆటోమేషన్, ఎలక్ట్రిసిటీ జనరేటర్ వాటర్ కన్జర్వర్, అంబ్రిల్లా మోడల్ ఫర్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ వంటి ఆవిష్కరణలు ఆకట్టుకున్నాయి.
'ఫ్లై వీల్' టెక్నాలజీ
హైదరాబాద్ కలెక్టరేట్‌లో ఏర్పాటుచేసిన ప్రదర్శనను కలెక్టర్ మాణిక్‌రాజ్ ప్రారంభించారు. బైక్ పార్కింగ్, హెల్త్ విభాగం, ఈ-బైక్, సేఫ్టీ బ్యాంగిల్, ఫ్లై వీల్ టెక్నాలజీ ఇలా పలు విభాగాలకు చెందిన ఆవిష్కరణలు ప్రదర్శనలో కొలువుదీరాయి. చాగంటి శ్రీనివాస్ భాస్కర్ అనే నిపుణుడు రూపొందించిన 'ఫ్లై వీల్' టెక్నాలజీ ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఇంక్యుబేటర్ తయారీ
జగిత్యాలలో పలువురు ఔత్సాహికులు ప్రదర్శించిన ఆవిష్కరణలు ఆలోచింపజేశాయి. కార్యక్రమంలో ఏర్పాటు చేసిన 17 ప్రదర్శనలను తిలకించిన మంత్రి కొప్పుల ఈశ్వర్, కలెక్టర్ శరత్ వాటి పనితీరును అడిగి తెలుసుకున్నారు. నగదు రహిత లావాదేవీలు, కోతులను పారదోలేందుకు, పండ్ల మొక్కల పెంపకం, తక్కువ ఖర్చుతో ఇంక్యుబేటర్ తయారీ ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
మొక్కలు నాటే పరికరం
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో పలువురు తయారు చేసిన ఆవిష్కరణలను ప్రదర్శించారు. గ్రామ పంచాయతీల్లో చెత్త తరలింపునకు ఉపయోగించేందుకు అనుకూలంగా ఉండే ట్రాలీ వాహనం, పొలాల్లో రైతే స్వయంగా కలుపు తీసుకునే విధంగా ఏర్పాటు చేసిన రోటవేటర్... కూలీలతో ఇబ్బందులు లేకుండా కేవలం ఇద్దరు వ్యక్తులు మొక్కలు నాటుకునే విధంగా తయారుచేసిన పరికరం అందరిని ఆకట్టుకున్నాయి. ప్రభుత్వ ప్రోత్సాహం ఉంటే మరిన్ని నూతన ఆవిష్కణలు చేస్తామంటున్నారు రూపకర్తలు.
ఇవీ చూడండి: గవర్నర్ తేనీటి విందుకు హాజరైన పలువురు ప్రముఖులు..