మహబూబ్నగర్, నారాయణపేట, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ప్రస్తుతం 70శాతానికి పైగా పంటలు సాగుకాగా... వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాలో సాగు విస్తీర్ణం 50 శాతం దాటలేదు. జూన్, జులై నెలఖరు వరకూ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని ఐదు జిల్లాల్లో... నమోదైన లోటు వర్షపాతం కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు సాధారణ స్థాయికి చేరింది. అన్ని జిల్లాల్లోనూ వర్షపాతం సాధారణ స్థాయికి చేరుకుంది.
ఏయే జిల్లాల్లో ఎంత సాగయింది
మహబూబ్నగర్ జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం లక్షా 17వేల హెక్టార్లు కాగా.. ప్రస్తుతం 97వేల హెక్టార్లలో పంటల్ని సాగు చేశారు. మిలిగిన జిల్లాలతో పోలిస్తే అత్యధికంగా 83శాతం విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయి. వర్షాధార ప్రాంతమైన నారాయణపేట జిల్లాలోనూ.. లక్షా 37వేల హెక్టార్లలో పంటలు సాగు కావాల్సి ఉండగా ఇప్పటికీ లక్ష హెక్టార్లలో పంటలు వేశారు. సాగు విస్తీర్ణం 78శాతంగా ఉంది. కల్వకుర్తి ఎత్తిపోతల పథకంపై ఆధారపడిన నాగర్ కర్నూల్ జిల్లాలో మాత్రం సాగు నత్తనడకన సాగుతోంది. 2లక్షల 16వేల హెక్టార్లలో పంటలు సాగవాల్సి ఉండగా.. లక్షా 58వేల హెక్టార్లలోనే పంటలు వేశారు. జూరాల, నెట్టెంపాడు, తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం కిందే అధికంగా ఆయకట్టు ఉన్న జోగులాంబ గద్వాల జిల్లాలోనూ.. సాగు విస్తీర్ణం 50శాతానికి చేరలేదు.
కొందరిది ఆశ... కొందరిది నిరాశ
ఇప్పటికే వేసిన మెట్ట పంటలకు ఎడతెరపి లేని వర్షాలు కొంత నష్టాన్ని కలిగిస్తున్నాయని రైతులు వాపోతున్నారు. ముఖ్యంగా కంది, పత్తి పంటల్లో మొక్కలు ఎర్రబారడంతో పాటు... పురుగులు ఆశించే అవకాశం ఎక్కువగా ఉందని అంచనా వేస్తున్నారు. వరి సాగు చేయాలనుకునే రైతులకు మాత్రం అనుకూలమైన వాతావరణం ఉంది. బోరుబావుల్లో భూగర్భ జలాలు పెరగడం, నీటి వనరులు నిండటం వల్ల రైతులు వరినాట్లకు సన్నద్ధమవుతున్నారు.
ఇదీ చూడండి: 'మరో 4 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు'