amazon sailfin catfish : 'మా చెరువులోకి కొత్తరకం చేపలొచ్చాయి. అవి ఏం చేపలో మాకే అర్థం కావడం లేదు. వాటిని చూసి మిగతా చేపలను తినడానికి ప్రజలు భయపడుతున్నారు. ఎట్లంటే అవి చాలా భయంకరంగా ఉన్నాయి. దెయ్యంలా కనిపిస్తున్నాయి. చూడ్డానికి నల్లగా.. మొసలి మల్లే కనిపిస్తున్నాయి. వాటిని చూస్తేనే వణుకు పుడుతుంది. వాటిని ఏం చేయాలో మాకేం తోస్తలేదు. ఇవి ఎందుకొచ్చి, ఎక్కడి నుంచి వచ్చాయో తెలియడం లేదు. ఒకవేళ చేపలకు కరోనా వచ్చి ఇలా అయ్యిపోయాయని అంటున్నారు కొంతమంది. మా చెరువునే నమ్ముకుని సుమారు 60 కుటుంబాలు బతుకుతున్నాం. ఈ పరిస్థితిలో ఆ చేపలను నివారించేందుకు ప్రభుత్వం నుంచి సాయం కావాలి.' చెరువులో ఉన్న చేపల్ని తినేస్తూ.. తమ కడుపుపై కొడుతున్న దెయ్యం చేపల్ని ఎలా నివారించాలో తెలియడం లేదంటున్నారు మహబుబ్‌నగర్ జిల్లా బుద్ధారం గ్రామానికి చెందిన మత్య్సకారుడు బుద్దయ్య.
చెరువులో చేపలు పెరుగుతుంటే మత్స్యకారుల ఆనందానికి అవదులుండవు. గత రెండేళ్లుగా వానలు సంవృద్ధిగా కురవడంతో రాష్ట్రంలో చెరువులు జలకలను సంతరించుకున్నాయి. ప్రభుత్వం మత్య్సశాఖ అభివృద్ధికోసం చెరువుల్లో చేపల పెంపకం చేపట్టడంతో మత్య్సకారులు చాలా సంతోష పడ్డారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఊహించని విపత్తు ఆ ఊళ్లో మత్స్యకారులకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ఎక్కడి నుంచి వచ్చాయో తెలియని దెయ్యం చేపలు.. మిగతా చేపల్ని తినేస్తున్నాయి. గతంలో ఒకటి రెండున్న దెయ్యం చేపలు ఇప్పుడు వందల సంఖ్యలో పుట్టుకొచ్చాయి. వాటిని ఎలా నివారించాలో తెలియడం లేదంటున్నారు.
ఏమిటీ దెయ్యం చేపలు...
''అమెజాన్ సెయిల్‌ఫిన్ క్యాట్‌ఫిష్'' స్థానికంగా వీటిని దెయ్యం చేపలు, బల్లి చేపలు అని పిలుస్తుంటారు. అలంకరణ కోసం అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న ఒక రకమైన క్యాట్ ఫిష్ ఇది. ఇవి అక్వేరియంలో పేరుకుపోయే నాచును తినేస్తూ ఉంటాయి. నాచుతో పాటు ఆక్వేరియంలో ఉన్న చిన్న చేపల్ని ఆరగించేస్తుంటాయి. అందువల్ల వీటిని పెద్ద అయ్యే లోగా చంపడమో.. బయట నీటిలో వదిలేయడమో చేస్తుంటారు. అయితే ఈ చేపలు బుద్ధారం గ్రామంలో ఉన్న చెరువులోకి ఎలా వచ్చాయో తెలియడం లేదు.
మా కడుపుమీద కొడుతున్నాయి
మత్య్య సహకార సంఘం ఆధ్వర్యంలో చెరువులో వదిలిన చేప పిల్లలను దెయ్యం చేపలు తినేస్తుండటంతో చెరువులో చేపల సంతతి తగ్గిపోతుందని మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. గతేడాది ఈ చెరువులో 3 లక్షలు విలువ చేసే లక్ష చేప పిల్లలను వదిలినా.. దెయ్యం చేపల వల్ల వాటి సంతతి వృద్ది చెందలేదు. వాటన్నింటినీ ఈ దెయ్యం చేపలే ఆరగించాయని మత్య్సకారులు అంటున్నారు.
అధికారులు స్పందించాలి..
సుమారు 60కి పైగా కుటుంబాలు ఈ చెరువుపైనే ఆధారపడి ఉన్నాయని.. ఈ దెయ్యం చేపల వల్ల ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం సహకరించి వాటి నివారణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఇదే పరిష్కారం..
''అమెజాన్ సెయిల్‌ఫిన్ క్యాట్‌ఫిష్'' పీడను వదిలించుకోవాలంటే చెరువును పూర్తి స్థాయిలో ఎండబెట్టడం లేదా తక్కువ పరిమాణంలో బ్లీచింగ్ కలపడమే మార్గం అని మత్స్యశాఖ అధికారులు పేర్కొంటున్నారు.
ఇదీ చూడండి : 'సర్పంచ్ మా భూములను వేరే వాళ్లకి ఇచ్చారు.. న్యాయం చేయండి'