Farmers Sells At Fruits Roadside : అది మహబూబ్‌నగర్ జిల్లాలోని దేవరకద్ర మండలం గూరకొండ గ్రామం. పాడిపంటలకు నెలవైన ఈ ప్రాంతంలో ప్రజల ప్రధాన ఆదాయ వనరు వ్యవసాయం. ఊరిలో చాలా మంది కాయగూరలు, పండ్లు సాగుచేస్తూ ఉంటారు. గత కొంతకాలం వరకు తమ పంటను అందరి రైతుల మాదిరిగానే మార్కెట్లో విక్రయించి.. దళారులు నిర్ణయించిన ధరకు కష్టాన్ని అమ్ముకుని బతికేవారు.. కానీ గత కొంత కాలంగా వారి ఆలోచన విధానం మారింది. ఆరుగాలం శ్రమించే రైతన్న... ఆలోచనకు పనిచెప్పాడు. తన కష్టానికి తానే ధర ఎందుకు నిర్ణయించుకోలేకపోన్నాననే ఆవేదన నుంచి ఓ ఆలోచన వచ్చింది. అది ఆ ఊరి రైతులను వ్యాపారులగా ఎదిగేలా చేసింది.
గూరకొండ గ్రామం ఒకప్పుడు పెద్దగోప్లాపూర్కు అనుబంధంగా ఉండేది. ఈ రెండు గ్రామాలు.. కోదాడ నుంచి కర్ణాటకలోని రాయచూర్‌కు వెళ్లే 167వ జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్నాయి. ఆ గ్రామాల రైతులు.. తాము మార్కెట్‌కు వెళ్లి పంటను అమ్ముకోవడం ఏమిటి.. తామే ప్రత్యక్షంగా అమ్ముకోవాలని నిర్ణయించుకున్నారు. అందుకు ఆ జాతీయ రహదారిని మార్కెట్ వనరుగా వినియోగించుకున్నారు.
నేను మా పొలంలో పండే పంటను రోడ్డుపై అమ్ముతున్నా. వాటితో పాటు బయట నుంచి కూడా తెచ్చి అమ్ముతున్నాను. ఈ రోడ్డు పక్కనే మాకు మంచి గిరాకి అవుతోంది. సుమారు 20వరకు దుకాణాలు వేశాము. కొన్ని పండ్లు అవి హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి అమ్ముతున్నాం. అంతా మంచిగా ఉంది. పంటకు ఎకరాకు సుమారు రూ.60వేల వరకు ఖర్చు వస్తుంది.. వాటిని ఇక్కడ అమ్ముకుంటే సుమారు రూ.2లక్షల వరకు వస్తుంది. -వెంకట రాములు, రైతు గూర కొండ
రైతులే వ్యాపారులై..
హైవే పక్కన తమ పంటను విక్రయిస్తూ.. లాభాలు ఆర్జిస్తున్నారు. హైవేమీద వెళ్లేవారు.. నాణ్యమైన, తాజా కూరగాయలు, పండ్లు లభించడంతో ఆగి.. కొనుగోలు చేసుకుని వెళ్తున్నారు. ఇప్పుడు ఆ రైతుల పని మూడు పువ్వులు, ఆరు కాయలు, డజను పండ్లుగా ఉంది. సీజన్ బట్టి.. గ్రామాలలో సాగు చేసే ఉల్లి, ఇతర కూరగాయలతో పాటు బంతిపూలు, పుచ్చకాయలు, ఖర్బూజ రకరకాల ఉత్పత్తులు విక్రయిస్తున్నారు.
రోడ్డు పక్కన కార్లు, లారీలు, బైక్‌లు అవి ఆపి చాలా మంది తింటున్నారు. ఇళ్లకు తీసుకెళ్తున్నారు. మా పొలాల్లో ఉన్న వాటితో పాటు బయట పొలాల నుంచి తెస్తున్నాం. మా దగ్గర ఎక్కువ ఉంటే హైదరాబాద్ పంపిస్తాం. మాకు కావాల్సి ఉంటే అక్కడ నుంచి తెప్పించుకుంటున్నాం. -శివ, రైతు గూరకొండ
అందుకే ఇక్కడ కొంటున్నారు..
రోడ్డు పక్కన తాజా ఉత్పత్తులు లభించడంతో రానురాను ఇక్కడ కొనుగోలు చేసేవారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. కొన్నిసార్లు డిమాండ్ ఎక్కువగా ఉంటే రైతులు.. ఇతర ప్రాంతాల నుంచి పంటను కొనుగోలు చేసుకొచ్చి విక్రయిస్తున్నారు. చుట్టుపక్కల గ్రామాల్లోని రైతుల పంటను సేకరించి హైవే పక్కన విక్రయిస్తున్నారు. ఈ మార్గంలో ప్రయాణం చేసేవారు.. ఇక్కడ లభించే కూరగాయలు, పండ్లుకోసం ప్రత్యేకంగా వస్తున్నారంటే రైతుల వ్యాపారం.. ప్రజల్లోకి ఎంతబాగా వెళ్లిందో అర్థమవుతోంది. మార్కెట్లో ధరకంటే తక్కువ ధరకే తాజా ఉత్పత్తులు లభించడంతో ఆగి మరీ కొనుక్కుని వెళ్తున్నారు.
రోడ్డు పక్కన ఫ్రెష్‌గా ఉన్నాయి. పక్కనే ఉన్న పొలం నుంచి తెచ్చి అమ్ముతున్నారు. కొవిడ్ సమయంలో సీజనబుల్ పండ్లు తినడం మంచిదే కాబట్టి వీటిని ఎక్కువ మంది కొంటున్నారు. పైగా రీజనబుల్ ధరల్లో దొరుకుతున్నాయి.
ఇక్కడ పండ్లు చాలా బాగుంటాయి. ఈ వైపు ఎప్పుడు వచ్చినా ఇక్కడ పండ్లు తీసుకుంటూ ఉంటాము. పక్కనే పొలంలో కోసి.. ఇక్కడ అమ్ముతున్నారు. ఇక్కడ కూర్చుని తినడం కూడా చాలా సంతోషంగా ఉంది. --- కొనుగోలుదారులు
ఇన్నాళ్లూ పెట్టుబడుల కోసం బాధపడ్డాం, కనీస ధరకోసం ప్రాధేయపడ్డాం. పంట అమ్మాలంటే మార్కెట్ వైపు, డబ్బుల కోసం దళారులవైపు చూసే రోజులు పోయాయి. ఇక శ్రమ మనది, పెట్టుబడి మనది, ధర మనది, లాభం మనది... ఎవరైనా తాజా పండ్లు, కూరగాయలు కావాలంటే.. రోడ్డు పక్కన ఉన్న మా దుకాణానికి రండి అంటున్నారు అక్కడి రైతులు.
లాభాల కోసం అమ్మకాలు చేసేవాడు వాడు వ్యాపారి.. కష్టానికి ప్రతిఫలం ఆశించే వాడు రైతు.. రైతే వ్యాపారి అయితే.. అందుబాటు ధరల్లో తాజా ఉత్పత్తులు లభించడమే కాకుండా.. రైతు కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. దానికి ఉదాహరణే ఈ ఊరి రైతులు.
ఇదీ చూడండి : పాట పాడి మెప్పించింది.. వరం కోరమంటే.. ఊరికి బస్సు అడిగింది