Minister Srinivas Goud on Kalti Kallu deaths: మహబూబ్‌నగర్‌లో కల్తీ కల్లు వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. ఇటీవల అస్వస్థతకు గురైన పదుల సంఖ్యలో కల్లు బాధితులు వరుసగా ప్రభుత్వాస్పత్రిలో చేరారు. వీరిలో కోడూరుకు చెందిన ఆశన్న ఆదివారం రాత్రి చనిపోగా.. మంగళవారం రాత్రి మహబూబ్‌నగర్‌లోని అంబేడ్కర్ నగర్‌కు చెందిన విష్ణుప్రకాశ్ ప్రాణాలు కోల్పోయాడు. తాజాగా కోడూరు గ్రామానికి రేణుక అనే మహిళ ప్రాణాలు కోల్పోవటం కలకలంరేపింది. మరో మహిళ పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు.
Kalti Kallu deaths in Mahabubnagar : ఈ నెల ఏడో తేది నుంచి 12మంది వరకు ఇన్‌పేషెంట్లుగా చేరగా అందులో నలుగురికి ఐసీయూలో చికిత్స అందించారు. వీరిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. 30కి పైగా బయటి రోగులుగా చికిత్స పొంది.. ఇళ్లకు వెళ్లిపోయారు. బాధితుల్లో ఎక్కువ మంది మహిళలే ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఈ ఘటనపై తాజాగా రాష్ట్ర అబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు.
కారణం అది కాదు: ఈ మరణాలకు కల్తీకల్లు కారణం కాదని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో వారంతా ఆస్పత్రిలో చేరారని.. వైద్య నివేదికలు, వైద్యుల పర్యవేక్షణలోనూ అదే తేలినట్లు చెప్పారు. శవపరీక్ష కోసం నమూనాలు సేకరించి, ఫోరెన్సిక్‌కు పంపామని.. అలాగే వివిధ కల్లు డిపోల్లో నమానాలు సేకరించి ప్రయోగశాలకు పంపినట్లు చెప్పారు. వచ్చే నివేదికల్లో కల్తీ కల్లే కారణమని తేలితే.. బాధ్యులను విడిచిపెట్టబోమని హెచ్చరించారు. కల్తీకల్లుపై ఆధారాలుంటే పోలీసు లేదా ఎక్సైజ్ శాఖకు ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు.
"కొంతమంది లివర్ పాడవటం వల్ల చనిపోయారు. మరొకరు చాలా ఫిట్స్‌తో ఆస్పత్రిలో చేరారు. ఫిట్స్ కారణంగానే చనిపోయారని బంధువులు చెప్పారు. ఎఫ్ఐఆర్, బంధువుల రిపోర్ట్ ప్రకారం వేరే సమస్యల వల్ల చనిపోయారని ఉంది. మరి కల్తీ కల్లు వల్ల అని ఎలా అంటున్నారు. ఫిర్యాదు చేస్తే ఎంక్వైరీ చేయిస్తాము. ఫోరెన్సిక్ రిపోర్ట్ ఉంటుంది కాబట్టి కల్తీ కల్లు వల్లే చనిపోయారని తెలిస్తే బాధ్యులను ఎవరినీ వదిలిపెట్టం." - శ్రీనివాస్‌గౌడ్, ఎక్సైజ్ శాఖ మంత్రి
పక్కదారి పట్టించేందుకు ప్రయత్నం: కల్తీకల్లు కారణంగా మనుషులు చనిపోతే.. ఘటనలను పక్కదారి పట్టించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. కల్తీ కల్లుకు బాధ్యులైన వారిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని కాంగ్రెస్ నేత వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ మరణాలకు బాధ్యత వహిస్తూ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ రాజీనామా చేయాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు పరిహారం అందించటంతో పాటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని అండగా నిలవాలన్నారు.
రాజకీయ ఒత్తిడే కారణం: మరోవైపు కల్తీకల్లు వ్యవహారాన్ని పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. చనిపోయిన వాళ్లంతా మహబూబ్ నగర్‌లోని వివిధ కల్లు కాంపౌండ్‌లలో క్రమం తప్పకుండా కల్లు సేవించే వారే ఉన్నట్లు తెలుస్తోంది. కల్లులో మత్తుమందు మోతాదులో తేడా రావడం, కొందరు కల్లు మానేయడంతో వింత ప్రవర్తన, వాంతులు, కాళ్లు చేతులు వంకర్లు పోవడంలాంటి లక్షణాలతో ఆస్పత్రిలో చేరారు. ఆల్కహాలిక్ విత్ డ్రావల్ సిండ్రోంతో బాధ పడతున్నారని తొలుత వైద్యులే వెల్లడించారు. కానీ.. రెండ్రోజులుగా వైద్యులు, ఎక్సైజ్ శాఖ అధికారులు, బాధిత కుటుంబాలు ఈ విషయంపై నిరాకరిస్తున్నాయి. రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే ఎవరూ నోరువిప్పడం లేదని ఆరోపణలు వస్తున్నాయి.
ఇవీ చదవండి: