గత కొన్ని రోజులుగా కరోనా కేసులు నమోదు కాకపోవడం వల్ల మహబూబ్‌నగర్ జిల్లా గ్రీన్ జోన్‌లోకి వచ్చిందని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఇప్పటికే నారాయణపేటను కరోనా ఫ్రీ జిల్లాగా ప్రకటించారని తెలిపారు. మరో ఆరు రోజుల్లో కొత్త కేసులు నమోదు కాకపోతే మహబూబ్‌నగర్ కూడా ఆ జాబితాలోకే చేరుతుందని పేర్కొన్నారు. మహబూబ్‌నగర్ కలెక్టరేట్‌లోని రెవెన్యూ సమావేశ మందిరంలో అధికారులతో మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమీక్షించారు.
వలసల జిల్లా నుంచి... బియ్యం రవాణా
వలసల జిల్లాగా పేరొందిన పాలమూరు నుంచి కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు బియ్యం రవాణా చేయడంపై మంత్రి హర్షం వ్యక్తం చేశారు. స్థానిక మామిడి పండ్లను ఇతర దేశాలకు ఎగుమతి చేయడం ఆనందంగా ఉందన్న మంత్రి.. వలస కూలీలకు వసతి, నిత్యవసరాలను అందజేస్తున్నామన్నారు. ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న రాష్ట్రానికి చెందిన కూలీలకు ఆయా ప్రభుత్వాలను సంప్రదించి సరుకులను అందిస్తున్నామని వివరించారు. ప్రభుత్వం ప్రకటించినట్లుగా మే 7 వరకు లాక్ డౌన్ కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న తెలంగాణ వాసులను సైతం రాష్ట్రానికి రప్పించే అంశంపై మే 5న నిర్ణయం తీసుకుంటామని మంత్రి చెప్పుకొచ్చారు.