కృష్ణానదిపై తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం (Palamuru Ranga Reddy Lift Irrigation Scheam- PRLIS) పనుల్లో పర్యావరణ ఉల్లంఘనలు జరిగినట్లు సంయుక్త కమిటీ వెల్లడించింది. 2017లో కేంద్రానికి రాసిన లేఖ ప్రకారం ప్రాజెక్టు ముందస్తు నిర్మాణ పనులు మాత్రమే చేపట్టాల్సి ఉండగా.. దీనికి భిన్నంగా పూర్తిస్థాయి పనులు జరుగుతున్నాయని తెలిపింది. ఇందులో పర్యావరణ చట్టాల ఉల్లంఘనలున్నాయని అభిప్రాయపడింది. తాగునీటి అవసరాల నిమిత్తం 90 టీఎంసీల సామర్థ్యంతో పీఆర్‌ఎల్‌ఐఎస్ పనులు (PRLIS Works) చేపడుతున్నట్లు తెలంగాణ పేర్కొన్నప్పటికీ, ఇందులో తాగునీటి అవసరాలు 7.15 టీఎంసీలు మాత్రమేనంది.
ఇక్కడి 8 పంపులు రోజుకు 2.07 టీఎంసీల చొప్పున 60 రోజులకు 120 టీఎంసీల నీటిని పంపింగ్ చేయగలవని పేర్కొంది. దీనికి అదనంగా డిండి ప్రాజెక్టు సమీపంలో 30 టీఎంసీల సామర్థ్యంతో పనులు చేపట్టినట్లు తమ పరిశీలనలో వెల్లడైందని తెలిపింది. ఈమేరకు సంయుక్త కమిటీ చెన్నైలోని జాతీయ హరిత ట్రైబ్యునల్‌కు గురువారం నివేదిక సమర్పించింది. ఎన్జీటీ ఆదేశాల మేరకు పీఆర్‌ఎల్‌ఐఎస్‌లో భాగంగా నిర్మిస్తున్న నార్లాపూర్, ఏదుల, వట్టెం, కర్వెన, ఉదండాపూర్ రిజర్వాయర్లను సెప్టెంబరు 15, 16 తేదీల్లో కమిటీ సందర్శించింది. నార్లాపూర్ రిజర్వాయర్ స్థలం వద్ద రెండు టన్నెళ్ల పనులు జరుగుతున్నాయని, ఎలాంటి పర్యావరణ ప్రణాళిక లేకుండా మట్టిని పోస్తున్నారని వివరించింది. ఈ మట్టి దిబ్బలను నిర్మాణాలకు వినియోగిస్తామని, ఇవి తాత్కాలికమేనని వివరణ వచ్చిందని తెలిపింది.
ఇదే పరిస్థితి మిగిలిన ఏదుల, వట్టెం, కర్వెన, ఉదండాపూర్ రిజర్వాయర్‌ల ప్రాంతాల్లోనూ కనిపిస్తోందని పేర్కొంది. ప్రాజెక్టు ప్రారంభానికి 2017లో పర్యావరణ అధ్యయన నివేదిక తయారీలో, అనుమతుల నిమిత్తం కేంద్రానికి సమర్పించిన లేఖలో 60 రోజుల్లో 90 టీఎంసీల వరద నీటిని తాగునీటి అవసరాలకు ఎత్తిపోస్తామని తెలంగాణ పేర్కొందని, ఈ ప్రాజెక్టు పరిధిలోని గ్రామాలకు కేవలం 7.15 టీఎంసీలు సరిపోతాయని చర్చల్లో తేలిందని వెల్లడించింది. 90 టీఎంసీల్లో సింహభాగం ఇరిగేషన్ అవసరాలకేనంది. అయితే సాగునీటి అవసరాలకు రెండో దశలో పనులు చేపట్టనున్నామని, ఇప్పటికే ప్రజాభిప్రాయ సేకరణ పూర్తయిందని, అనుమతుల కోసం దరఖాస్తు చేశామని ఇరిగేషన్ అధికారులు నివేదించారని కమిటీ తెలిపింది. ఈ ప్రాజెక్టు పనుల్లో భాగంగా ముంపునకు గురయ్యే తండాలు, గ్రామాలు ఉన్నాయని, వాటిని ఖాళీ చేయించారని కమిటీ పేర్కొంది. నిర్వాసితులకు పునరావాస పునర్నిర్మాణ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపింది.
తాగునీటి అవసరాలకే.. తెలంగాణ సభ్యులు
కేంద్ర పర్యావరణ ప్రభావ అధ్యయన నోటిఫికేషన్‌కు విరుద్ధంగా పనులు జరుగుతున్నాయని ఇద్దరు సభ్యులు మినహా కమిటీ అభిప్రాయపడింది. 4.97 లక్షల హెక్టార్ల సాగునుద్దేశించి చేపట్టిన ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు అవసరమని, ప్రాజెక్టు ముందస్తు పనులకు మాత్రమే కేంద్రం అనుమతించిందని కమిటీ తెలిపింది. అయితే ఇందుకు వ్యతిరేకంగా పనులు జరుగుతున్నాయని కమిటీ అభిప్రాయపడగా కమిటీలోని మహబూబ్‌నగర్ కలెక్టర్ ఎస్.వెంకటరావు, గనుల శాఖ సహాయ డైరెక్టర్ పి.విజయ రామరాజు విభేదించారు. కేవలం తాగునీటి అవసరాలకే పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
పర్యావరణ పరిరక్షణకు సిఫార్సులు
పర్యావరణ నష్ట పరిహారం రూ.3.71 కోట్లుగా కమిటీ అంచనా వేసింది. 1916 రోజులు నిబంధనలకు విరుద్ధంగా పనులు జరిగాయంది. ఇప్పటికే దెబ్బతిన్న పర్యావరణ పునరుద్ధరణలో భాగంగా సిఫార్సుల అమలుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలంది. ఇందుకోసం బడ్జెట్ కేటాయించి ప్రత్యేక ఖాతాను నిర్వహించాలని పేర్కొంది. మట్టి దిబ్బలను చదును చేసి, గుంతలను పూడ్చి మొక్కలు పెంచాలంది. స్టోన్‌క్రషర్స్, రెడీమిక్స్ వినియోగాలకు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అనుమతులు పొందాలని తెలిపింది.
కూలీల కాలనీల్లో మురుగునీటి పారుదల ఏర్పాట్లు చేయాలని, గ్రీన్‌బెల్ట్‌ను అభివృద్ధి చేయాలని వివరించింది. తెలంగాణ ప్రభుత్వం పర్యావరణ శాఖతో పాటు ఇతర శాఖల అనుమతులను పొందాలంది. వ్యర్థాల నిర్వహణ బాధ్యతను ప్రైవేటు ల్యాబ్‌లకు అప్పగించాలని, భూగర్భ జలాల, గాలి నాణ్యతను నెలకోసారి పరీక్షించాలని స్పష్టంచేసింది. కాలుష్య నియంత్రణపై పీసీబీ అనుమతులు పొందాలని.. నదీ, మట్టిని వ్యర్థాలు కలుషితం చేయకుండా సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని పేర్కొంది.
ఇదీ చదవండి: Telugu Academy Funds scam: తెలుగు అకాడమీలో నిధుల గోల్‌మాల్‌పై త్రిసభ్య కమిటీ విచారణ