ఉద్యోగలు, ఉపాధ్యాయులు, పెన్షనర్లను తీవ్రంగా నిరాశపరిచినా పీఆర్సీ వద్దంటూ మహబూబ్ నగర్ జిల్లాకేంద్రంలోని చౌరస్తా వద్ద ఉద్యోగులు ధర్నా చేపట్టారు. ఐక్యవేదిక ఆధ్వర్యంలో పీఆర్సీ ప్రకటన ప్రతులను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర సాధన కోసం పోరాటంలో ముందుండి నడిపించిన ఉద్యోగులను ఈ నివేదిక నిరాశకు గురి చేసిందన్నారు. ధనిక రాష్ట్రం కావడం వల్ల 63 శాతం ఫిట్మెంట్ ప్రకటిస్తారని ఆశించామన్నారు. దాదాపు 30 నెలల ఆలస్యంతో ఇచ్చిన మొట్టమొదటి పీఆర్సీని తక్కువగా ప్రకటించడంపై ఆవేదన వ్యక్తం చేశారు.
మరో వైపు ఇళ్ల అద్దె ధరలు పెరుగుతుంటే నివేదికలో తగ్గించడం విడ్డూరంగా ఉందన్నారు. ఉద్యోగుల వయో పరిమితి పెంపు మినహా అన్ని వ్యతిరేకంగానే ఉన్నాయని మండిపడ్డారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేవిధంగా ఫిట్మెంట్, పీఆర్సీని ప్రకటించాలని.. లేనిపక్షంలో ఉద్యమం తీవ్రతరం చేస్తామని ఉద్యోగ సంఘాలు హెచ్చరించాయి.