భాజపా ఉపాధ్యాక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా దేవరకద్ర నియోజకవర్గ కేంద్రానికి వచ్చిన డీకే అరుణకు పార్టీ కార్యకర్తలు పవన్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని వివిధ పార్టీలకు చెందిన నాయకులు డీకే అరుణ సమక్షంలో భాజపాలో చేరారు.
నీటి వాటాల కోసం ఈ నెల 6న జరిగే అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో తెలంగాణ వాటా కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో వాదన చేయాల్సింది పోయి... దేవుళ్లతోనైనా కొట్లాడుతా అనడం ఏంటని ప్రశ్నించారు. దేవుళ్లతో... రాక్షసులు కొట్లాడుతారని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు.
మాయ మాటలతో తెలంగాణ ప్రజలను మరో మారు మోసం చేయాలని చూస్తుంటే భారతీయ జనతా పార్టీ ఊరుకునే ప్రసక్తి లేదని ఆమె హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నిధులతో పథకాలను చేపట్టి తిరిగి కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని అన్నారు. గ్రామాలకు వాడ వాడలో తిరుగుతూ కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోదీ తీసుకొస్తున్న పథకాలను ప్రజలకు వివరిస్తూ తెలంగాణలో భాజపాను అధికారంలోకి తీసుకొస్తామని అన్నారు. అనంతరం కార్యకర్తలు నిర్వహించిన ద్విచక్ర వాహన ర్యాలీలో ఆమె పాల్గొన్నారు.
ఇదీ చదవండి: గాంధీ జయంతి: సత్యాగ్రహ నినాదం.. నిశ్శబ్ద పోరాటం