ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని తహశీల్దార్ కార్యాలయాల్లో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు జోరుగా సాగుతున్నాయి. 5 జిల్లాల్లోని లావాదేవీలు త్వరలోనే 50వేల మైలురాయిని చేరుకోనున్నాయి. నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఇప్పటికే 10వేలకు పైగా లావాదేవీలు పూర్తయ్యాయి. ఉమ్మడి జిల్లాలోని అన్ని తహశీల్దార్ కార్యాలయాల్లో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లను 2020 నవంబర్ 2న అధికారికంగా ప్రారంభించారు. అప్పట్లో క్రయవిక్రయాలు, వారసత్వం, భాగ పరిష్కారాలు సహ కొన్ని ఐచ్ఛికాలతో పోర్టల్ ప్రారంభమైంది. నాలుగు నెలల్లో కొత్త ఐచ్ఛికాలు సైతం అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం కొత్త పట్టాదార్ పాస్‌పుస్తకం ఉన్నవారికి జీపీఏ, డీఏజీపీఏ, పాస్‌పోర్టుతో ప్రవాసులకు రిజిస్ట్రేషన్, మార్టిగేజ్, కోర్టు వివాదాల్లో ఉన్న భూములపై క్రయవిక్రయాల నిలిపివేతకు దరఖాస్తు ఐచ్చికాలున్నాయి. తాజాగా 9సవరణలకు ప్రభుత్వం అవకాశం కల్పించింది.
లావాదేవీల్లో ఇబ్బందులు
కొత్త ఐచ్ఛికాలు అందుబాటులోకి వస్తున్నా గతంలో ఉండి ప్రస్తుతం అందుబాటులో లేని కొన్ని ఆప్షన్ల వల్ల రైతులు వ్యవసాయ భూముల లావాదేవీల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ధరణి రాక మునుపు జీపీఏ పొందిన సాగు భూములపై ధరణిలో ప్రస్తుతం లావాదేవీలు జరిపే అవకాశం లేదు. సర్వేనెంబర్‌పై ధరణిలో నమోదైన విస్తీర్ణం కంటే అధిక విస్తీర్ణంలో భూముల లావాదేవీలకు అవకాశం లేదు. గతంలో అధికారికంగానే లావాదేవీలు జరిగి డిజిటల్ సంతకాలు చేయని భూములపైనా ధరణిలో లావాదేవీలకు అవకాశం లేకుండా పోయింది. కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు పొందని ఏ భూములపైనా లావాదేవీలకు ప్రస్తుత ధరణి పోర్టల్‌లో అవకాశం లేదు. పాత పాసు పుస్తకాలున్న భూయజమానులు చనిపోతే వారి వారసులకు విరాసత్ చేసే ఐచ్చికం అందుబాటులో లేదు.
మరిన్ని ఐచ్ఛికాలు తీసుకొస్తాం
రైతుల ఇబ్బందులను తొలగించేలా ధరణి పోర్టల్‌లో మార్పు లు చేసి... త్వరలోనే మరిన్ని ఐచ్ఛికాలు అందుబాటులోకి తీసుకొస్తామని మహబూబ్‌నగర్ కలెక్టర్ వెంకట్రావు తెలిపారు.
గతంలో కంటే అధిక ఖర్చు
అటు రిజిస్ట్రేషన్లకయ్యే ఖర్చు సైతం గతంలో కంటే అధికంగా ఉందని రైతులు వాపోతున్నారు. ఇక దస్త్రాల నిర్వాహణ లోపం, అధికారుల తప్పిదాల కారణంగా ప్రస్తుతమున్న ధరణి పోర్టల్‌లో లావాదేవీలు జరగని రైతులు అధిక సంఖ్యలో ఉన్నారు. ఈ నేపథ్యంలో సవరణలకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.
వివరాలు ఇలా...
జిల్లా | రిజిస్ట్రేషన్లు నమోదు | విరాసత్ పూర్తి | నమోదు | పార్టేషన్ పూర్తి | నమోదు పూర్తి | నాలా | నమోదు | పెండింగ్ పూర్తి | మ్యుటేషన్లు నమోదు | మొత్తం స్లాట్లు పూర్తి | నమోదు | పూర్తి |
మహబూబ్‌నగర్ | 8383 | 7963 | 821 | 792 | - | - | 232 | 203 | 3260 | 2654 | 12696 | 11612 |
నారాయణపేట | 5528 | 5255 | 863 | 830 | 44 | 43 | 134 | 94 | 3186 | 2634 | 9755 | 8856 |
వనపర్తి | 5947 | 5783 | 577 | 557 | 34 | 34 | 142 | 137 | 2406 | 134 | 9106 | 6645 |
నాగర్‌కర్నూల్ | 10245 | 5783 | 837 | 790 | 43 | 43 | 248 | 237 | 4804 | 4515 | 16177 | 15430 |
గద్వాల | 4861 | 4629 | 594 | 572 | 43 | 49 | 187 | 175 | 3065 | 113 | 8760 | 5538 |
మొత్తం | 56494 | 48081 |
ధరణి విజయవంతం
వ్యవసాయభూముల లావాదేవీల్లో అవినితీకి తావు లేకుండా రైతుల సౌకర్యార్థం ప్రభుత్వం ధరణి పోర్టల్‌ను ప్రారంభించింది. మహబూబ్‌నగర్ జిల్లాలో 10వేలకు పైగా లావాదేవీలు పూర్తయ్యాయి. రైతులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కొత్త పాస్ పుస్తకాలు ఉన్న వారికి జీపీఏ, పాస్ పోర్టు ఆధారంగా ఎన్నారైలకు రిజిస్ట్రేషన్, గతంలో రిజిస్ట్రేషన్ పూర్తై మ్యుటేషన్ కాని వారికి మ్యూటేషన్ చేసుకునే అవకాశం వచ్చింది. మరిన్ని ఐచ్ఛికాలు సైతం అందుబాటులోకి వస్తాయి. వాటి కోసం ఎదురు చూస్తున్నాం. -సీతారామారావు, అదనపు కలెక్టర్, మహబూబ్ నగర్
ఐచ్ఛికాలు కావాలి
ధరణితో ఎన్నో ప్రయోజనాలు రైతులకు అందుబాటులోకి వచ్చాయి. నిషేదిత భూములు, వ్యవసాయ భూముల వివరాలు ఆన్ లైన్లో చూసుకోవచ్చు. కోరిన రోజు స్లాట్ బుక్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. వారసత్వం, భాగస్వామ్యం, మార్టిగేజ్, నాలా చాలా లావాదేవీలు జరుగుతున్నాయి. ఆర్ఎస్ఆర్ వేరియేషన్, మిస్సింగ్ సర్వే నెంబర్ ఎక్ట్సెంట్, డిలిషన్ లాంటి ఐచ్ఛికాలు ఇస్తే బాగుంటుందని భావిస్తున్నాం. -పార్ధసారధి, మహబూబ్ నగర్ అర్బన్ తహశీల్దార్
ఇదీ చదవండి: హైకోర్టుకు క్షమాపణ చెప్పిన ఖమ్మం కలెక్టర్ ఆర్.వి కర్ణన్