Villagers Want to Shut Down The Iron Industry: మహబూబ్‌నగర్ జిల్లా బాలనగర్ మండలం గుండేడ్ గ్రామ సమీపంలోని ఐరన్ పరిశ్రమ నుంచి వచ్చే కాలుష్యాన్ని తట్టుకోలేమని, వెంటనే ఆ పరిశ్రమను మూసివేయాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. గ్రామానికి సమీపంలో 2006లోనే ఐరన్ పరిశ్రమ ఏర్పాటుచేశారు. గతంలో మూతపడినా తిరిగి ఇటీవలే ప్రారంభించారు.
Villagers Are Sick Because of The Iron Industry: ఐతే పరిశ్రమ నుంచి వచ్చే పొగ, దుమ్ము, ధూళి వల్ల కాలుష్యం పరిసరాలకు వ్యాపించి గ్రామంలో నివసించే పరిస్థితి లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెట్లు, చేమలు, పంటపొలాలు, తోటలను నల్లటి ధూళి కమ్మేస్తోంది. ఆ ధూళి వల్ల పంటలు పండట్లేదని తోటల్లో దిగుబడి తగ్గిపోయిందని రైతులు చెబుతున్నారు. పరిశ్రమను మూసివేయాలంటూ గ్రామసభలో తీర్మానం చేసినా అధికారులు పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు.
అధికారులు వచ్చినప్పుడు ఉత్పత్తి, పనులు నిలిపివేసి కాలుష్యం కనిపించకుండా చేస్తున్నారని చెబుతున్నారు. ఎన్నివిజ్ఞప్తులు చేసినా ఫలితం లేక వారంరోజులుగా ధర్నాలు చేస్తున్నట్లు వివరించారు. పరిశ్రమ నుంచి ఎలాంటి కాలుష్యం రావడం లేదని, కొందరు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని యాజమాన్యం చెబుతోంది. అధికారులు, పోలీసుల సమక్షంలోనే గ్రామస్థులతో మాట్లాడామని 20 ఏళ్లుగా పరిశ్రమ నడుపుతున్నామని, కాలుష్య నివారణకు ఫిల్టర్లను సైతం వాడుతున్నట్లుగా వివరించారు.
పరిశ్రమ ఏర్పాటు, ఉద్యోగాల కల్పనకు తాము వ్యతిరేకం కాదని, కాలుష్యం లేని ఏ పరిశ్రమనైనా నడుపుకోవచ్చంటున్నారు గుండేడ్ గ్రామస్థులు. పరిశ్రమపై చర్యలు తీసుకోకపోతే పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు.
ఇవీ చదవండి: