Pakistan Protests Death Toll : పాకిస్థాన్ మాజీ ప్రధాని, తెహ్రీక్ -ఏ- ఇన్సాఫ్ (పీటీఐ) అధినేత ఇమ్రాన్ ఖాన్‌ను జైలు నుంచి విడుదల చేయాలంటూ ఆ పార్టీ మద్దతుదారులు చేపట్టిన భారీ నిరసన హింసాత్మకంగా మారింది. ఈ ఘటనలో నలుగురు పారామిలిటరీ సిబ్బంది, ఇద్దరు పోలీసులు మృతి చెందారు. దాదాపు 100మంది సెక్యూరిటీ సిబ్బంది గాయపడ్డారు. నిరసనలు హింసాత్మకంగా మారడం వల్ల, రాజధాని ఇస్లామాబాద్ ప్రాంతంలో ప్రభుత్వం భద్రతా చర్యలు కట్టుదిట్టం చేసింది. కనిపిస్తే కాల్చేయమని ఆర్మీకి ఆదేశాలు జారీ చేసింది. దీంతో ముందు జాగ్రత్తగా రాజధాని ఇస్లామాబాద్‌లోని విద్యాసంస్థలకు మంగళవారం సెలవు ప్రకటించారు.
మంగళవారం కూడా పీటీఐ మద్దతుదారుల నిరసనలు కొనసాగుతున్నాయి. ఇస్లామాబాద్, రావల్పిండికి వెళ్లే ప్రధాన రహదారులను మూసివేసిన ప్రభుత్వం, పెద్దఎత్తున భద్రతబలగాలను మోహరించింది. ఆయా నగరాలకు వెళ్లే రైళ్లు, మెట్రో బస్సుల సర్వీసులను కూడా నిలిపివేసింది. ఇస్లామాబాద్‌లోకి ప్రవేశించకుండా అడ్డుకున్న పోలీసులపై ఆందోళనకారులు దాడి చేశారు. ఈ ఘనటలో ఐదుగురు భద్రతాసిబ్బంది మృతి చెందారు.
మరోవైపు పంజాబ్ ప్రావిన్స్‌లో ఒక పోలీసు అధికారి మరణించగా, మరో 119మంది తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. 22 పోలీసు వాహనాలకు నిప్పంటించారని చెప్పారు. ఆందోళనకారుల్లో నలుగురు మృతి చెందినట్లు ప్రకటించారు.
ఇమ్రాన్ భార్య బుష్రాబీబీ నేతృత్వంలో ఆదివారం మొదలైన నిరసన ప్రదర్శన ఇస్లామాబాద్ చేరింది. ఇమ్రాన్ జైలు నుంచి విడుదలయ్యాకే తాము ఇంటికి వెళ్తామంటూ ఆయన భార్య బుష్రాబీబీ పేర్కొనటం వల్ల పీటీఐ శ్రేణులు బ్యారికేడ్లను దాటుకొని ఇస్లామాబాద్‌లోకి ప్రవేశించారు. ఆందోళనకారులను అడ్డుకున్న పోలీసులపై హింసాత్మక దాడులకు పాల్పడుతున్నారు. దీంతో ఆందోళనకారులపై పోలీసులు లాఠీఛార్జీ చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే భద్రతా సమస్యలు ఉన్న ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను ప్రభుత్వం నిలిపివేసింది. అయితే ఇది ఎంతకాలం ఉంటుందని స్పష్టం చేయలేదు. పీటీఐ అధినేత ఇమ్రాన్‌ఖాన్ 150కి పైగా క్రిమినల్ కేసుల్లో జైళ్లో ఉన్నారు.