మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం... అక్కడి ప్రజల చిరకాల వాంఛ. హైదరాబాద్-రాయచూర్ జాతీయ రహదారిపై దేవరకద్ర వద్ద రైల్వే లైన్‌ను దాటేందుకు ఆ వంతెన నిర్మాణం చేయాలన్నది ఏళ్లనాటి డిమాండ్. 2014లో టెండర్లు ఖరారైనా గుత్తేదారు పనులు చేపట్టకపోవడంతో ఒప్పందాన్ని రద్దు చేసి తిరిగి టెండర్లు పిలిచారు. 2019లో 24కోట్ల అంచనాతో పరిపాలన అనుమతులు మంజూరు చేశారు. 18కోట్లతో సివిల్ పనులు ప్రారంభమయ్యాయి. ఏళ్లుగా నిర్మాణానికి నోచుకోని వంతెన పనులు ఎట్టకేలకు ప్రారంభమైనా నత్తనడకన సాగుతున్నాయి. రెండేళ్లు గడిచినా 50 శాతం పనులు పూర్తి కాకపోవడంపై జనం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వంతెన పనులు సాగుతుండటంతో.... ప్రత్యమ్నాయంగా ఏర్పాటు చేసిన రహదారిపై ప్రజలకు ఇక్కట్లు తప్పట్లేదు. రైల్వేగేటు పడినప్పుడల్లా వాహనాల రద్దీ పెరిగి ఎక్కడికక్కడ నిలిచిపోతున్నాయి. వర్షం పడి గుంతలరోడ్లు వాహనదార్లకు పరీక్షలు పెడుతున్నాయి. వాన లేనప్పుడు దుమ్ము, ధూళితో రోడ్డు పక్కన దుకాణాదార్లు, పాదచారులు అవస్థలు పడుతున్నారు.
ఆక్రమణల వల్ల. పనులు ఆలస్యం
వంతెన నిర్మాణం జరుగుతున్న ప్రాంతంలో ఆక్రమణల వల్ల.... పనులు ఆలస్యంగా సాగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. వాటిని తొలగించాలని రోడ్లు భవనాల శాఖ అధికారులు పోలీసులు, రెవెన్యూ శాఖకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేది సమాచారం. ప్రజాప్రతినిధులు సైతం ఆ దిశగా ప్రయత్నించడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం 30 స్లాబ్‌లకుగాను 15 మాత్రమే పూర్తయ్యాయి. స్లాబులు, గోడలు, రోడ్డు నిర్మాణం పూర్తైతేనే సర్వీసు రోడ్ల పనులు చేపట్టాల్సి ఉంది. ఇప్పటి వరకు ఏడున్నర కోట్ల విలువైన పనులు పూర్తికాగా సుమారు 6 కోట్లకు గుత్తేదారు ప్రభుత్వానికి బిల్లులు సమర్పించారు. అందులో 3 కోట్లు మంజూరు కాగా నాలుగున్నర కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. పనులు ఆలస్యంగా సాగడానికి బిల్లుల చెల్లింపుల జాప్యమూ ఓ కారణమని తెలుస్తోంది. ఐతే ఎట్టి పరిస్థితుల్లోనూ డిసెంబర్ కల్లా పనులు పూర్తి చేస్తామని రోడ్లు భవనాల శాఖ అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: డ్రగ్స్ కేసులో సినీ ప్రముఖులకు ఈడీ సమన్లు