Mana Ooru-Manabadi Programme: ప్రభుత్వ పాఠశాలలను సకల వసతులతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది.. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు రాష్ట్రప్రభుత్వం తలపెట్టిన ప్రతిష్ఠాత్మక కార్యక్రమం మనఊరు -మనబడి, మనబస్తీ-మనబడి. రాష్ట్రంలో 26,072 బడులకుగాను 9,123 పాఠశాలలను తొలిదశలో అభివృద్ధి చేసేందుకు ఎంపిక చేశారు. అందుకోసం రూ.3,497 కోట్లు కేటాయించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 1,099 పాఠశాలలను తొలివిడతలో ఎంపిక చేయగా 999 చోట్లనే అంచనాలు పూర్తయ్యాయి. పరిపాలన, సాంకేతిక అనుమతులు పొంది, పాఠశాల యాజమాన్య కమిటీ తీర్మానాలు పొందిన 152 బడులకే 15శాతం నిధుల్ని రివాల్వింగ్ ఫండ్ కింద మంజూరు చేశారు. ఆ పాఠశాలల్లోనే పనులు ప్రారంభమయ్యాయి. మిగిలిన చోట్ల అసలు పనులే మొదలుకాలేదు.
మరోసారి అంచనాలు: చాలాచోట్ల ప్రక్రియ అంచనాల వద్దే ఆగిపోయింది. అంచనాల రూపకల్పనలో తప్పులు దొర్లడంతో మరోసారి అంచనాలు రూపొందించాల్సి వచ్చింది. శిథిలావస్థకు చేరిన గదులకు బదులుగా కొత్తగదుల నిర్మాణాలకు అంచనాలు రూపొందించమని ఆదేశించగా.. కొందరు అదనపు తరగతుల నిర్మాణాలను అంచనాల్లో చేర్చగా వాటిని సవరించాల్సి వచ్చింది. ఉన్నత పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా డైనింగ్ హాల్ నిర్మాణాలకు తొలుత అంచనాలు రూపొందించారు. తర్వాత ఒక్కో పాఠశాలకు 14 లక్షలతో ఒకే డైనింగ్ షెడ్‌కు అంచనాలివ్వాలని ప్రభుత్వం ఆదేశించడంతో మరోసారి అంచనాలు రూపొందించాల్సి వచ్చింది. పంపినవి సరైనవా కావా తేల్చేందుకు మండల విద్యాశాఖ అధికారి, ప్రత్యేక అధికారి, ఇంజినీర్లు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని చెప్పడంతో ప్రక్రియ ఆలస్యమైంది. పరిపాలన, సాంకేతిక అనుమతులు, ఎఫ్‌టీవో జారీ పక్రియ మందకొడిగా సాగుతుండటంతో చాలా చోట్ల పనులు మొదలుకాలేదు.
బళ్లు తెరిచేలోపు పనులు పూర్తికాకపోతే.. :పాఠశాల యాజమాన్య కమిటీ ద్వారా విద్యుదీకరణ, తాగునీటివసతి, శిథిలావస్థకు చేరిన గదులస్థానంలో కొత్త గదుల నిర్మాణం, డైనింగ్ హాల్, పెద్ద తరహా, చిన్న తరహా మరమ్మతులు చేపట్టాల్సి ఉంది. ఉపాధి హామీ పథకం కింద మరుగుదొడ్లు, ప్రహరీలు, వంట గదుల నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంది. విద్యాశాఖ నేరుగా ఫర్నీచర్, పెయింటింగ్, ఆకుపచ్చ బోర్డుల ఏర్పాటు, డిజిటల్ తరగతులు ఏర్పాటు చేయాల్సి ఉంది. జూన్ 13 నాటికి ఆ పనులన్నీ పూర్తికావడం కష్టంగానే కనిపిస్తుంది. బళ్లు తెరిచేలోపు పనులు పూర్తికాకపోతే విద్యార్ధులకు మౌలికవసతులు అందకపోగా, అప్పటికే చేపట్టిన పనులకు ఆటంకం ఏర్పడే అవకాశముంది. అధికారులు మాత్రం బళ్లు తెరిచేలోగా పనులు పూర్తయ్యేలా చర్యలు చేపట్టినట్లు చెబుతున్నారు.
రూ.30లక్షల కంటే అధికవ్యయంతో సివిల్ పనుసలు చేపట్టాల్సి వస్తే టెండర్ ప్రక్రియ ద్వారా పూర్తిచేయాల్సి ఉంది. అలాంటి పాఠశాలల్లోనూ పనులు ఇంకా మొదలుకాలేదు. జూన్ నాటికి ఆయా పాఠశాలల్లో పనులు పూర్తి కావడం కష్టంగానే కనిపిస్తోంది.
ఇవీ చదవండి: